-

ఆర్‌కామ్‌ దివాలా పిటీషన్‌పై ఎన్‌సీఎల్‌ఏటీ దృష్టి 

9 Apr, 2019 00:04 IST|Sakshi

న్యూఢిల్లీ: రుణభారం పేరుకుపోయిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) దివాలా అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దివాలా పిటీషన్‌పై విచారణ కొనసాగించాలా లేదా అన్న దానిపై తానే తుది నిర్ణయం తీసుకుంటామని నేషనల్‌ కంపెనీ లా అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) స్పష్టం చేసింది. వివరాల్లోకి వెడితే.. తమకు రావాల్సిన రూ. 550 కోట్ల బాకీల కోసం స్విస్‌ టెలికం సంస్థ ఎరిక్సన్‌ గతంలో ఈ పిటీషన్‌ వేసింది. అయితే, ఆ తర్వాత బాకీలు వసూలు కావడంతో పిటీషన్‌ను ఉపసంహరించుకుంటామని తెలిపింది. కానీ, ఇతర రుణదాతలకు బాకీలు చెల్లింపులు జరిపే పరిస్థితుల్లో తాము లేమని, దివాలా పిటీషన్‌పై ప్రొసీడింగ్స్‌ కొనసాగించాలని ఎన్‌సీఎల్‌ఏటీని ఆర్‌కామ్‌ కోరుతోంది. ఎరిక్సన్‌ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తోంది.
 
రూ.550 కోట్లు ఎరిక్సన్‌ తిరిగి ఇచ్చేయాలా?

ఈ నేపథ్యంలో ఎన్‌సీఎల్‌ఏటీ తాజాగా సోమవారం తన అభిప్రాయం వెల్లడించింది. ఒకవేళ ఆర్‌కామ్‌ దివాలా ప్రక్రియకు అనుమతించిన పక్షంలో ఎరిక్సన్‌ తనకు దక్కిన రూ. 550 కోట్లు కూడా వాపసు చేయాల్సి ఉంటుందని ద్విసభ్య బెంచ్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎస్‌జే ముఖోపాధ్యాయ పేర్కొన్నారు. ‘రుణాలిచ్చిన మిగతావారందరినీ కాదని ఒక్కరే మొత్తం బాకీ సొమ్మును ఎలా తీసుకుంటారు‘ అని ప్రశ్నించారు. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో దివాలా ప్రొసీడింగ్స్‌ కొనసాగించడమా లేదా నిలిపివేయడమా అన్నదానిపై ఎన్‌సీఎల్‌ఏటీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఎన్‌సీఎల్‌ఏటీ ఏప్రిల్‌ 30కి వాయిదా వేసింది.  

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ 4 సంస్థల వివరాలివ్వండి.. 
మరో నాలుగు గ్రూప్‌ కంపెనీల వివరాలు సమర్పించాల్సిందిగా రుణ సంక్షోభం ఎదుర్కొంటున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ను ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశించింది. వాటిల్లో పెన్షను, ప్రావిడెంట్‌ ఫండ్స్‌ పెట్టుబడులు, వాటి రుణాల వివరాలు ఇవ్వాల్సిందిగా సూచించింది. ఉద్యోగులకు చెందాల్సిన పింఛను నిధులను తొక్కిపెట్టి ఉంచకూడదని, ఆ మొత్తాన్ని ముందుగా విడుదల చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. హజారీబాగ్‌ రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే, జార్ఖండ్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌ ఇంప్లిమెంటేషన్‌ కంపెనీ, మొరాదాబాద్‌ బరైలీ ఎక్స్‌ప్రెస్‌వే, వెస్ట్‌ గుజరాత్‌ ఎక్స్‌ప్రెస్‌వే సంస్థలు వీటిలో ఉన్నాయి. చెల్లింపులు జరపగలిగే సామర్థ్యాలను బట్టి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ కంపెనీలను మూడు వర్ణాలుగా వర్గీకరించిన సంగతి తెలిసిందే. తాజాగా కాషాయ వర్ణం (నిర్వహణపరమైన చెల్లింపులు జరిపే సామర్థ్యం ఉన్నవి) కింద వర్గీకరించిన నాలుగు సంస్థల విషయంలో ఎన్‌సీఎల్‌ఏటీ ఆదేశాలిచ్చింది. మొత్తం 13 కాషాయ వర్ణ సంస్థల్లో మిగతా తొమ్మిది సంస్థలు తదుపరి విచారణ తేదీ అయిన ఏప్రిల్‌ 16లోగా రుణాల చెల్లింపు ప్రణాళికను సిద్ధం చేసే ప్రయత్నాల్లో ఉండాలని పేర్కొంది. 

మరిన్ని వార్తలు