రిలయన్స్‌ బీమా ఐపీఓ మళ్లీ వెనక్కి

31 Oct, 2019 05:08 IST|Sakshi

న్యూఢిల్లీ: అనిల్‌ ధీరూబాయ్‌ అంబా నీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ప్రణాళికను అటకెక్కించింది. సెబీకి సమర్పించిన ఐపీఓ ముసాయిదా పత్రాలను వెనక్కి తీసుకుంది. ఐపీఓను ఎందుకు  ఉపసంహరించుకుందో వివరాలను కంపెనీ గానీ, ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న మోతిలాల్‌ ఓస్వాల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ గానీ వెల్లడించలేదు. షెడ్యూల్‌ ప్రకారమైతే, ఈ ఐపీఓలో భాగంగా రూ.200 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ జారీ చేయనున్నది. వీటితో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) కింద రిలయన్స్‌ క్యాపిటల్‌ 7.9 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నది.  

2017లో కూడా అంతే..!  
రిలయన్స్‌ బీమా ఐపీఓ డాక్యుమెంట్లను ఈ ఏడాది ఫిబ్రవరి 8నే మోతిలాల్‌ ఓస్వాల్‌ సంస్థ మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఈ డాక్యుమెంట్లను ఉపసంహరించుకుంటున్నామని ఈ నెల 24న సెబీకి ఒక మెయిల్‌ పంపించింది. రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఐపీఓ ప్లాన్‌ను ఉపసంహరించుకోవడం ఇది రెండోసారి. 2017, అక్టోబర్‌లో ఐపీఓ పత్రాలను సమర్పించి ఆ మరుసటి నెలలో సెబీ నుంచి ఆమోదం పొందింది. అయితే అప్పుడు స్టాక్‌ మార్కెట్‌ ఒడిదుడుకులమయంగా సాగడం, ఐపీఓల పట్ల ఇన్వెస్టర్లకు పెద్దగా ఆసక్తి లేకపోవడంతో ఐపీఓ ప్లాన్‌ను అటకెక్కించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా