రిలయన్స్, బీపీకి మరో రూ.1,700 కోట్ల జరిమానా

16 Aug, 2017 00:51 IST|Sakshi
రిలయన్స్, బీపీకి మరో రూ.1,700 కోట్ల జరిమానా

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం కేజీ–డీ6 క్షేత్రాల నుంచి నిర్దేశిత లక్ష్యాలకన్నా తక్కువగా గ్యాస్‌ ఉత్పత్తి చేసినందుకు గాను రిలయన్స్‌ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థలపై కేంద్రం మరో 264 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 1,700 కోట్లు) జరిమానా విధించింది. దీంతో 2010 ఏప్రిల్‌ 1 నుంచి దాదాపు ఆరేళ్లుగా లక్ష్యాలను సాధించలేకపోవడం వల్ల విధించిన మొత్తం పెనాల్టీ సుమారు 3.02 బిలియన్‌ డాలర్లకి(దాదాపు రూ. 19,500 కోట్లు) చేరిందని చమురు శాఖ తెలిపింది.

 వ్యయాల రికవరీని అనుమతించకపోవడం రూపంలో ఈ జరిమానా ఉంటోంది. వాస్తవానికి ఉత్పత్తిలో వాటాల ఒప్పందం (పీఎస్‌సీ) ప్రకారం రిలయన్స్, దాని భాగస్వామ్య సంస్థలు బీపీ, నికో రిసోర్సెస్‌ ముందుగా తమకైన వ్యయాలను గ్యాస్‌ అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంలోనుంచి తగ్గించుకుని మిగతా లాభాలను ప్రభుత్వంతో పంచుకుంటున్నాయి. అయితే, వ్యయాల రికవరీకి అనుమతించని పక్షంలో లాభాల్లో ప్రభుత్వ వాటా పెరుగుతుంది.

2011–12లో కేజీ–డీ6 బ్లాక్‌లోని ధీరూభాయ్‌–1, 3 గ్యాస్‌ క్షేత్రాల నుంచి రోజుకు 80 మిలియన్‌ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్‌ ఉత్పత్తి చేయాల్సి ఉండగా 35.33 ఎంసీఎండీ మాత్రమే ఉత్పత్తయ్యింది. ఆతర్వాత నుంచి తగ్గుతూ ప్రస్తుతం 4 ఎంసీఎండీ కన్నా తక్కువకి క్షీణించింది. గడిచిన సంవత్సరాలకు సంబంధించి వ్యయాల రికవరీని అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ ఆర్‌ఐఎల్, బీపీ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఆర్బిట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించింది.

మరిన్ని వార్తలు