‘సంపద’కు కేరాఫ్‌.. రిలయన్స్‌

19 Dec, 2019 01:17 IST|Sakshi

సృష్టికర్తల్లో అగ్రస్థానం..

టాప్‌–3లో ఇండియాబుల్స్‌ వెంచర్స్, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు

మోతీలాల్‌ ఓస్వాల్‌ అధ్యయన నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: గడిచిన ఐదు సంవత్సరాల్లో... అంటే 2014–19 మధ్య వాటాదారులకు అత్యంత సంపదను సమకూర్చిన కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) నిలిచింది. ఈ కాలంలో ఈ కంపెనీ రూ.5.6 లక్షల కోట్ల మేర విలువను పెంచుకున్నట్టు ‘మోతీలాల్‌ ఓస్వాల్‌ వార్షిక సంపద సృష్టి అధ్యయనం 2019’ తేల్చింది. అధికంగా సంపద తెచ్చిపెట్టిన కంపెనీల్లో.. మొదటి 100 కంపెనీలు కలసి 2014–19 కాలంలో సమకూర్చిన సంపద రూ.49 లక్షల కోట్లుగా ఉంది. ‘‘ఏడేళ్ల విరామం తర్వాత మరోసారి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 2014–19 కాలంలో రూ.5.6 లక్షల కోట్ల విలువను సమకూర్చి అత్యధిక సంపద సృష్టికర్తగా అవతరించింది. చరిత్రలో ఇప్పటి దాకా ఇదే అత్యధిక రికార్డు’’ అని బుధవారం విడుదలైన ఈ నివేదిక పేర్కొంది.

గత ఐదేళ్ల కాలంలో అత్యధికంగా, అత్యంత వేగంగా, నిలకడగా సంపద సమకూర్చిన టాప్‌ 3 కంపెనీలుగా ఆర్‌ఐఎల్, ఇండియా బుల్స్‌ వెంచర్స్, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు నిలవగా... వేగంగా సంపద తెచ్చిపెట్టిన వాటిల్లో ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ వరుసగా రెండోసారి మొదటి స్థానం సంపాదించడం గమనార్హం. ఈ షేరు గత ఐదేళ్లలో వార్షికంగా 78 శాతం కాంపౌండెడ్‌ రాబడులను తెచ్చిపెట్టింది. టాప్‌–10 సంపద సృష్టికర్తల్లో బజాజ్‌ ఫైనాన్స్‌ స్థానం ప్రత్యేకమని ఈ నివేదిక తెలిపింది. ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు 2009–19 కాలంలో కాంపౌండెడ్‌గా 49 శాతం చొప్పున స్థిరంగా సంపదను సృష్టించింది. ఇక 2014–19 కాలంలో సెన్సెక్స్‌ కాంపౌండెడ్‌ వార్షిక రాబడి 12 శాతంగా ఉంది. అన్ని రకాల మార్కెట్‌ పరిస్థితుల్లోనూ ఈ కంపెనీలు సంపదను తెచ్చిపెట్టినట్టు నివేదిక తెలియజేసింది.

ఫైనాన్షియల్‌ రంగం ముందంజ...   
ఫైనాన్షియల్‌ రంగం 2014–19 మధ్య కాలంలో అత్యంత సంపదను తెచ్చిపెట్టిన రంగంగా వరుసగా మూడో ఏడాది అగ్ర పథాన నిలిచింది. ప్రైవేటు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలే ఈ రంగాన్ని నడిపించాయి. కాకపోతే, ఇదే విభాగంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రం వాటాదారుల సంపదకు నష్టం చేకూర్చాయి. టాప్‌ 100 సంపద సృష్టికర్తల్లో ప్రభుత్వరంగ సంస్థలు కేవలం తొమ్మిదే చోటు సంపాదించాయి. అవి ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ, ఇంద్రప్రస్థ గ్యాస్, ఎల్‌ఐసీ హౌసింగ్, భారత్‌ ఎలక్ట్రానిక్స్, ఎన్‌బీసీసీ. 2014–19 మధ్య కాలంలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువలో మార్పుల ఆధారంగా ఈ గణాంకాలను మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ రూపొందించింది.

శ్రీమంతుల సగటు సంపద రూ.3.6 కోట్లే
విశ్రాంత జీవనానికి నెలకు రూ.93,000
స్టాండర్డ్‌ చార్టర్డ్‌ నివేదిక  

న్యూఢిల్లీ: దేశంలో సంపన్నుల సగటు ఐశ్వర్యం రూ.3.6 కోట్లేనని, విశ్రాంత జీవన కాలంలో ప్రతి నెలా వెచ్చించేందుకు వారికి రూ.93,000 మాత్రమే ఉంటున్నదని స్టాండర్డ్‌ చార్టర్డ్‌ ‘సంపద అంచనా నివేదిక 2019’ తెలియజేసింది. ఇందులో వర్ధమాన సంపన్నుల వద్ద సగటున రూ.1.3 కోట్లు, సంపన్నుల వద్ద రూ.2.6 కోట్లు, అధిక సంపన్నుల(హెచ్‌ఎన్‌డబ్ల్యూఐ) వద్ద రూ.6.9 కోట్ల మేర వారి రిటైర్మెంట్‌ నాటికి ఉంటుందని అంచనా వేసింది. ఈ లెక్కన ఒక్కో సంపన్నుని వద్ద రిటైర్మెంట్‌ సమయంలో ప్రతీ నెలా వ్యయం చేసేందుకు రూ.93,000 ఉంటుందని పేర్కొంది. ఈ నిధిని వారి కోరిక మేరకు సగటున నెలవారీగా వ్యయం చేస్తూ వెళితే మాత్రం వర్ధమాన సంపన్నులకు ఆరేళ్ల పాటు, సంపన్నులకు తొమ్మిదేళ్లు, హెచ్‌ఎన్‌డబ్ల్యూఐలకు ఐదేళ్ల పాటే సరిపోతుందని నివేదిక తెలిపింది. జీడీపీ వృద్ధి, వడ్డీ రేట్లు తదితర అంశాలతో ఎంత సంపదను సమకూర్చుకోగలరు? రిటైర్మెంట్‌ సమయంలో ప్రతినెలా ఎంత మొత్తంతో వారు జీవించగలరు? అనే గణాంకాలను ఈ సంస్థ రూపొందించింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా