వచ్చేసింది..జియోమార్ట్‌

2 Jan, 2020 04:18 IST|Sakshi

ఆన్‌లైన్‌ కిరాణా వ్యాపారంలోకి రిలయన్స్‌

ప్రాథమికంగా ముంబైలో కార్యకలాపాలు షురూ

త్వరలో దేశవ్యాప్తంగా విస్తరణ

ఈ–కామర్స్‌ దిగ్గజాలతో ఢీ..

ముంబై: చమురు నుంచి టెలికం దాకా వివిధ వ్యాపార విభాగాల్లోకి విస్తరించిన దిగ్గజ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) తాజాగా ఆన్‌లైన్‌ కిరాణా వ్యాపార విభాగంలోకి కూడా ప్రవేశించింది. జియోమార్ట్‌ పేరిట ఈ–కామర్స్‌ వెంచర్‌ను ప్రారంభించింది. ప్రాథమికంగా ముంబైలోని నవీ–ముంబై, థానే, కల్యాణ్‌ ప్రాంతాల్లో ప్రారంభించిన కార్యకలాపాలను త్వరలో దేశవ్యాప్తంగా విస్తరించనుంది. ఆఫ్‌లైన్‌–టు–ఆన్‌లైన్‌ వ్యాపారం ద్వారా 50,000 పైచిలుకు నిత్యావసర ఉత్పత్తులను విక్రయించనుంది. కనీస ఆర్డరు నిబంధనలేవీ లేకుండానే ఉచిత హోమ్‌ డెలివరీ సర్వీసులు కూడా అందించనున్నట్లు జియోమార్ట్‌ తన పోర్టల్‌లో పేర్కొంది. ప్రాథమికంగా ప్రారంభించిన సర్వీసులకు సబ్‌స్క్రయిబ్‌ చేసుకోవాలని, తొలి ఆర్డరుపై రూ, 3,000 దాకా పొదుపు చేసుకోవచ్చని ముంబైలో ని జియో మొబైల్‌ యూజర్లను జియోమార్ట్‌ ఆహ్వానిస్తోంది. జియోమార్ట్‌ సర్వీసులకు సంబంధించి త్వరలోనే ప్రత్యేక మొబైల్‌ యాప్‌ కూడా అందుబాటులోకి రానుంది. దీన్ని మై జియో, జియో మనీ యాప్‌లతో అనుసంధానించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఏడాదిగా కసరత్తు..: కమ్యూనికేషన్, కంటెంట్, కామర్స్‌ అనే మూడు వ్యాపార విభాగాల్లో విస్తరించే వ్యూహంతో రిలయన్స్‌ ముందుకెడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే జియో ద్వారా టెలికం రంగంలో సంచలనం సృష్టించింది. 2016లో జియోని ప్రవేశపెట్టిన తర్వాత డిజిటల్‌ స్ట్రీమింగ్, మ్యూజిక్, హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్, టీవీ వంటి డిజిటల్‌ సర్వీసులను భారీగా విస్తరిస్తోంది. అదే విధంగా జియోమార్ట్‌ ద్వారా ఈ–కామర్స్‌ విభాగంలోనూ సంచలనాలు సృష్టించేందుకు సిద్ధమైంది.

ఇందులో భాగంగా  తమ ఇంటర్నెట్‌ ఆధారిత పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌) డివైజ్‌ల ఊతంతో ఏడాది కాలం పైగా.. కిరాణా స్టోర్స్‌ను క్రమంగా తమ ప్లాట్‌ఫాంలో చేర్చుకుంటూ వస్తోంది. ఒక్క నవీ ముంబై ప్రాంతంలోనే ఏకంగా 10,000కు పైగా కిరాణా వ్యాపారులు ఇందులో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కిరాణా వ్యాపారులు నమోదు చేసుకున్నప్పటికీ.. ఇన్‌ఫ్రాపరమైన సౌలభ్యత కారణం గా ముంబైలో ముందుగా ప్రయోగాత్మకంగా కార్యకలాపాలు ప్రారంభించినట్లు వివరించాయి. కిరాణా వ్యాపారులు తమ స్టోర్‌లోని ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచడానికి, కొత్త స్టాక్స్‌కు ఆర్డర్లివ్వడానికి, కస్టమర్లకు ఆఫర్లు పంపడానికి, ఆన్‌లైన్‌ విక్రయా ల నిర్వహణకు ఈ పోర్టల్‌ ఉపయోగపడుతుంది.

అమెజాన్‌.. బిగ్‌బాస్కెట్‌లకు పోటీ...
రిలయన్స్‌ ఈ–కామర్స్‌ అరంగేట్రంపై ఏడాదిగా ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. జియో, రిలయన్స్‌ రిటైల్‌ ఊతంతో కొత్త ఈ–కామర్స్‌ వ్యాపార విభాగంపై కసరత్తు చేస్తున్నట్లు గతేడాది వైబ్రంట్‌ గుజరాత్‌ సదస్సులో రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ వెల్లడించినప్పట్నుంచీ.. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వాస్తవానికి ఆర్‌ఐఎల్‌ ఇప్పటికే ఏజియోడాట్‌కామ్‌ అనే ఫ్యాషన్‌ సైట్‌ ద్వారా, రిలయన్స్‌ డిజిటల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా ఈ–కామర్స్‌ విభాగంలో కార్యకలాపాలు సాగిస్తోంది. తాజా జియోమార్ట్‌ .. దానికి కొనసాగింపుగా పూర్తి స్థాయి ఈ–కామర్స్‌ వెంచర్‌ కానుంది. గతంలో టెలికం రంగంలో జియో ఎంట్రీ తరహాలోనే.. ఈ–కామర్స్‌లో జియోమార్ట్‌ కూడా పెను సంచలనాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి.

దిగ్గజాలుగా ఎదిగిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఈ–కామర్స్‌ సంస్థలతో పాటు బిగ్‌బాస్కెట్, గ్రోఫర్స్‌ వంటి ఆన్‌లైన్‌ గ్రాసరీ సంస్థలకు కూడా గట్టి పోటీదారుగా మారవచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే, ఇందుకోసం మిగతా ప్రత్యర్థి సంస్థల కన్నా మరిన్ని ప్రయోజనాలను కిరాణా వ్యాపారులకు అందించాల్సి ఉం టుందని పరిశ్రమవర్గాలు తెలిపాయి. చౌకగా ఉత్పత్తుల సరఫరా, మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు(ఎండీఆర్‌) మినహాయింపునివ్వడం వంటివి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా తమ దగ్గరున్న ఉత్పత్తులు, నిల్వల గురించి కచ్చితమైన వివరాలు అందించేలా వ్యాపారులను ఒప్పించ డం ఒకింత సవాలుగా ఉండవచ్చని తెలిపాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు