ఏడోసారీ రూ.15 కోట్లే

21 May, 2015 00:35 IST|Sakshi
ఏడోసారీ రూ.15 కోట్లే

రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ వార్షిక జీతభత్యాలు
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ వరుసగా ఏడో ఏడాది తన జీతభత్యాలను రూ. 15 కోట్లకే పరిమితం చేసుకున్నారు. దేశంలోనే అత్యంత సంపన్నుడైన అంబానీ 2008-09 నుంచి ఈ విధానం పాటిస్తున్నారు. అప్పట్లో సీఈవోల భారీ వేతనాలపై విమర్శలు చెలరేగిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల అంబానీ ఏటా రూ. 24 కోట్లు వదులుకుంటున్నట్లవుతోంది.

రూ. 38.86 కోట్ల మేర జీతభత్యాలు, కమీషన్ కింద అందుకునేందుకు అనుమతులు ఉన్నప్పటికీ .. ఒక మోస్తరు స్థాయికే కట్టుబడి ఉండటానికి ఆయన మొగ్గు చూపుతున్నారని 2014-15 ఆర్థిక సంవత్సర ఫలితాల వెల్లడిలో కంపెనీ పేర్కొంది.
 
జీతం కింద రూ. 4.16 కోట్లు, ఇతర భత్యాల కింద రూ. 60 లక్షలు, రిటైర్మెంట్ ప్రయోజనాల కింద రూ. 82 లక్షలు, లాభాలపై కమీషన్లు రూ. 9.42 కోట్లు అంబానీ అందుకున్నారు. మరోవైపు, ముఖ్య అధికార్లలో ఒకరైన ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పీఎంఎస్ ప్రసాద్ వేతనం ఎలాంటి మార్పులు లేకుండా రూ. 6.03 కోట్లుగా ఉంది. ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ.. నాన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ హోదాలో రూ. 5 లక్షలు సిట్టింగ్ ఫీజు కింద, రూ. 78.64 లక్షలు కమీషన్ కింద అందుకున్నారు.

మరిన్ని వార్తలు