రిలయన్స్‌ @10,00,000

29 Nov, 2019 02:30 IST|Sakshi

మార్కెట్‌ విలువలో ఈ మైలురాయిని చేరిన తొలి భారత కంపెనీ

ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయికి చేరిన షేరు 

జియో, రిటైల్‌ విభాగాల జోరు

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గురువారం మరో అరుదైన ఘనతను సాధించింది. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.10 లక్షల కోట్లకు చేరింది. ఈ స్థాయి మార్కెట్‌ క్యాప్‌ సాధించిన తొలి, ఏకైక భారత కంపెనీగా నిలిచింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హై, రూ.1,584ను తాకిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ చివరకు 0.6 శాతం లాభంతో రూ.1,580 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.10,01,555 కోట్లకు చేరింది. ఫలితంగా ఈ కంపెనీ ప్రమోటర్‌ ముకేశ్‌ అంబానీ సంపద రూ.4,28,973 కోట్లకు చేరింది. ఒక్క రిలయన్స్‌ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌.. 19 నిఫ్టీ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌కు, మొత్తం నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ సూచీలోని 250 కంపెనీల మార్కెట్‌ క్యాప్‌కు సమానం. కంపెనీ షేర్‌ ధరను ఆ కంపెనీ మొత్తం షేర్లతో గుణిస్తే వచ్చే విలువను మార్కెట్‌ క్యాప్‌గా వ్యవహరిస్తారు.  

ఆ రెండు విభాగాల జోరు....
అతి తక్కువ కాలంలోనే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ రూ.10 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ మైలురాయిని సాధించిందని రెలిగేర్‌ బ్రోకింగ్‌ ఎనలిస్ట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు. వినియోగ ఆధారిత టెలికం, రిటైల్‌ రంగాల్లో పెట్టుబడుల వల్ల రిలయన్స్‌ ఈ ఫలితాన్ని పొందిందని పేర్కొన్నారు. ఈ రెండు విభాగాల వాటా కంపెనీ మొత్తం లాభాల్లో నిలకడగా పెరుగుతోందని వివరించారు.  

25 సెషన్లలోనే లక్ష కోట్లు అప్‌....
ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి రిలయన్స్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.9 లక్షల కోట్లకు పెరిగింది. కేవలం 25 ట్రేడింగ్‌ సెషన్లలోనే మార్కెట్‌ క్యాప్‌ లక్ష కోట్లు పెరిగి రూ.10 లక్షల కోట్లకు చేరింది. గత ఏడాది ఆగస్టులో రూ.8 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ సాధించిన తొలి భారత కంపెనీగా అవతరించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ సెన్సెక్స్‌ 14 శాతం పెరగ్గా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ మాత్రం 41 శాతం ఎగబాకింది. రుణ రహిత కంపెనీగా నిలవాలన్న కంపెనీ లక్ష్యం, దానికి తగ్గట్లుగా ప్రయత్నాలు చేస్తుండటం, టెలికం టారిఫ్‌లను పెంచనుండటం, వినియోగదారుల వ్యాపారంపై దృష్టిని పెంచడం.. షేర్‌ జోరుకు కారణాలని నిపుణులంటున్నారు.

వచ్చే నెల నుంచి మొబైల్‌ చార్జీలను పెంచనున్నామని రిలయన్స్‌ జియో ప్రకటించినప్పటి నుంచి ఈ షేర్‌ పెరుగుతూనే ఉంది. కాగా ఈ క్యూ2లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ రికార్డ్‌ స్థాయిలో రూ.11,262 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇటీవల వరకూ అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ ఉన్న కంపెనీ అనే ట్యాగ్‌ కోసం రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టీసీఎస్‌ల మధ్య పోటీ ఉండేది. ఈ రేసులో ఈ రెండు కంపెనీలు నువ్వా ? నేనా అనే పోటీ పడేవి. ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న టీసీఎస్‌కు, రిలయన్స్‌కు మధ్య తేడా రూ. 2 లక్షల కోట్ల మేర ఉండటం విశేషం.  

రుణ భారం పెరుగుతూ ఉన్నా...
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ 2009 నుంచి 2016 వరకూ రూ.350–550 రేంజ్‌లో కదలాడింది. రిలయన్స్‌ జియో రంగంలోకి వచి్చన తర్వాత నుంచి షేర్‌ జోరు పెరిగింది. మూడేళ్లలో ఈ షేర్‌ 220 శాతం ఎగసింది. 1977లో ఈ కంపెనీ ఐపీఓకు వచి్చనప్పుడు రూ.10,000 ఇన్వెస్ట్‌ చేస్తే, అది ఇప్పుడు రూ.2.1 కోట్లకు పెరిగిందని అంచనా. కాలంతో పాటు మారుతూ రావడమే రిలయన్స్‌ ఘనతకు కారణం. నూలు తయారీ కంపెనీ నుంచి ఇంధన దిగ్గజంగా ఎదగడమే కాకుండా మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రిటైల్, టెలికం రంగాల్లోకి విస్తరించింది. 2009లో రూ.72,000 కోట్ల మేర ఉన్న రుణ భారం పదేళ్లలో 277 శాతం ఎగసి రూ.2.87 లక్షల కోట్లకు పెరిగింది. రుణ భారం ఈ స్థాయిలో పెరుగుతూ ఉన్నా, ఇన్వెస్టర్లు ఈ షేర్‌పై విశ్వాసాన్ని కోల్పోలేదు.

‘టార్గెట్‌’ పైపైకి...
రుణ రహిత కంపెనీగా నిలవాలన్న రిలయన్స్‌ కంపెనీ లక్ష్యం వచ్చే ఆరి్థక సంవత్సరంలో సాకారం కావచ్చని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తాఫా నదీమ్‌ అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ చమురు దిగ్గజం సౌదీ ఆరామ్‌కోకు వాటా విక్రయం, రిలయన్స్‌ జియో విభాగం కారణంగా భవిష్యత్తులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ మరింతగా పెరగగలదని పేర్కొన్నారు. బ్రోకరేజ్‌ సంస్థలు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌కు కొనచ్చు రేటింగ్‌ను ఇచ్చాయి. టార్గెట్‌ ధరలను పెంచాయి.


 

మరిన్ని వార్తలు