మరోసారి దూసుకొచ్చిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

19 Nov, 2019 14:21 IST|Sakshi

మార్క్‌ట్‌ క్యాప్‌ పరంగా అతిపెద్ద సంస్థగా రిలయన్స్‌ 

రూ .9.50 లక్షల కోట్లను అధిగమించిన తొలి భారతీయ కంపెనీ

సాక్షి,ముంబై:  ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.  మార్కెట్‌క్యాప్‌ పరంగా దేశంలో అతిపెద్ద మొట్టమొదటి కంపెనీగా నిలిచింది. మంగళవారం నాటి మార్కెట్‌లో రిలయన్స్‌ షేర్లు ఇంట్రా-డే 3 శాతానికి పైగా లాభపడి బీఎస్‌ఇలో ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి (రూ.1,508.45)ని తాకింది. దీంతో  రిలయన్స్‌ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ రూ .9.50 ట్రిలియన్లను దాటిన మొదటి భారతీయ కంపెనీగా అవతరించింది. అతి త్వరలోనే పది లక్షల కోట్ల రూపాయల మార్కెట్‌ క్యాప్‌ను  సాధించే దిశగా సాగుతోంది. 

అర్ధ శతాబ్దం క్రితం 1966లో ఒక ఉద్యోగితో, కేవలం రూ.1000 మూలధనంతో (అప్పటికి130 డాలర్లతో) రిలయన్స్‌ను స్థాపించారని, రిలయన్స్‌ను ప్రపంచ స్థాయి భారతీయ వ్యాపార సంస్థగా నిర్మించాలన్నది తన తండ్రి కల అని, అది తన జీవితకాలంలో సాకారం కావడం తన అదృష్టమని రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ గత ఏడాది మార్చిలో గుర్తు చేసుకున్నారు. అక్టోబర్ 18న, 9 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌ను దాటిన మొదటి సంస్థగా ఆర్‌ఐఎల్ నిలిచింది. 2019 క్యాలెండర్ సంవత్సరంలో ఆర్ఐఎల్ స్టాక్ ధర 34 శాతం పెరిగింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ ఇప్పటివరకు రూ .2.3 ట్రిలియన్లు పెరిగింది.  కాగా ఐటీ దిగ్గజం టీసీఎస్ మార్కెట్ విలువ రూ .7.91 లక్షల కోట్లతో రెండవ స్థానంలో ఉంది. మరోవైపు  హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్‌ కాప్ ఇటీవల రూ .7 లక్షల కోట్ల మైలురాయిని దాటి 3 వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు