క్రూడ్‌ షాక్‌, జియో దెబ్బ : రిలయన్స్‌కు భారీ నష్టం

14 Nov, 2017 15:07 IST|Sakshi

ముంబై : అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా పెరిగిపోవడం, ఇటీవల కాలంలో టెలికాం నెట్‌వర్క్‌ జియో జోరు తగ్గడం మార్కెట్‌ విలువలో దేశీయ అతిపెద్ద కంపెనీగా ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను భారీగా దెబ్బకొడుతున్నాయి. నవంబర్‌ మొదటి నుంచి బిలీనియర్‌ ముఖేష్‌ ఆంబానీ ప్రమోట్‌ చేసే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బొంబై స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో రూ.50వేల కోట్లను నష్టపోయింది. నవంబర్‌ నెల తొలి 13 రోజుల్లోనే కంపెనీ షేరు ధర 8 శాతానికి పైగా క్షీణించింది. ఆరు లక్షల కోట్లు దాటిని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ విలువ  సోమవారం ముగింపు నాటికి రూ.5.53 లక్షల కోట్లకు పడిపోయింది. 


క్రూడ్‌ ధరలు అంతకంతకు పెరిగిపోవడం కంపెనీ విలువపై స్వల్పకాలికంగా ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగుతున్నప్పటికీ దానికి సమానంగా దేశీయంగా పెట్రోల్‌ ఉత్పత్తుల ధరలు పెరగడం లేదు. సెప్టెంబర్‌ నుంచి బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 10 డాలర్ల మేర పెరిగి, 63 డాలర్లుగా నమోదైంది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలకు సమానంగా పెట్రోల్‌ ఉత్పత్తుల ధరలు పెరగాలంటే కనీసం రెండు వారాల సమయం పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. డిమాండ్‌ పడిపోతుందనే భయాందోళనతో కూడా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగవని తెలిపారు. 


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు మరో దెబ్బ దాన్ని టెలికాం వెంచర్‌ జియో ఇన్ఫోకామ్‌. కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ కంపెనీ ఎక్కువ మొత్తంలో ఆఫర్లతో దంచికొడుతుండటంతో, అంతేమొత్తంలో రుణం కూడా పెరుగుతోంది. మరోవైపు ఇటీవల కాలంలో జియో జోరు తగ్గింది. సబ్‌స్క్రైబర్లను తక్కువ మొత్తంలో ఆకట్టుకుంది. ఇటీవల ట్రాయ్‌ విడుదల చేసిన డేటాలోఆగస్టులో కేవలం 4.09 మిలియన్‌ కస్టమర్లను మాత్రమే జియో తన కస్టమర్లుగా యాడ్‌ చేసుకుంది. ఏడాది క్రితం కంపెనీ లాంచ్‌ అయినప్పటి నుంచి ఇదే రెండోసారి తక్కువ వృద్ధి నమోదుచేసిన నెల. 2017 జనవరి వరకు ప్రతి నెలా జియో 16 మిలియన్‌కు పైగా సబ్‌స్క్రైబర్లను ఆకట్టుకుంది. తర్వాత ఫిబ్రవరిలో 12 మిలియన్లకు, తర్వాత మార్చిలో 5.83 మిలియన్లకు, ఆ తర్వాత ఏప్రిల్‌లో మరింత కిందకి 3.87 మిలియన్లగా తన సబ్‌స్క్రైబర్లను చేర్చుకుంది. కంపెనీ కొత్త ఆఫర్లను లాంచ్‌ చేయడంతో మే నెలలో మళ్లీ తన సబ్‌స్క్రైబర్లను పెంచుకుంది. సబ్‌స్క్రైబర్లను ఆకట్టుకునే సంఖ్య పడిపోతుందనే సమయానికి జియో మరోసారి ట్రిపుల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లతో కస్టమర్ల ముందుకు వచ్చింది. 

మరిన్ని వార్తలు