రిలయన్స్ నుంచి విడిగా జియో..

22 Jun, 2017 09:44 IST|Sakshi
రిలయన్స్ నుంచి విడిగా జియో..
ముంబై: టెలికాం దిగ్గజాలకు చుక్కులు చూపిస్తున్న ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఇప్పటివరకు అధికారిక త్రైమాసిక ఫలితాలను ప్రకటించలేదు. కానీ జియో ఇన్ఫోకామ్ త్రైమాసిక ఫలితాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి విడిగా ప్రకటించాలని ముఖేష్ అంబానీ యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్యూ2(జూలై-సెప్టెంబర్ కాలం) నుంచి రిలయన్స్ జియో త్రైమాసిక ఫలితాలు అధికారికంగా మార్కెట్లోకి విడుదల కానున్నాయి. ఈ విషయంలో బోర్డు తుది ఆమోదం తెలుపాల్సి ఉందని, కానీ ఇంకా యోచన ప్రక్రియలోనే ఉన్నట్టు తెలిసింది. కంపెనీ వ్యాపారాలు అన్ని పూర్తిగా మార్కెట్లో సర్దుకున్నాక, ఫలితాలను విడిగా ప్రకటించనున్నామని ఓ అధికారి చెప్పారు. ఈ విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ఎలాంటి చట్టపరమైన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే మార్చితో ముగిసిన ఆరు నెలల కాలంలో జియోకు వచ్చిన నష్టాన్ని మాత్రం ప్రకటించారు. 
 
ముందటేడాది జియో నష్టం రూ.7.46 కోట్లు ఉంటే, అవి ఈ ఏడాది రూ.22.50 కోట్లుగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ ఫలితాలు కూడా కేవలం బాండ్ హోల్డర్స్ కోసం తీసుకొచ్చారు. గత సెప్టెంబర్ లో టెలికాం మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కంపెనీ ఉచిత ఆఫర్లతో సంచలన రేపిన సంగతి తెలిసిందే.మార్చి 31తో ఈ కంపెనీ ఉచిత సర్వీసులకు స్వస్తి చెప్పి, టారిఫ్ ప్లాన్స్ ను అమలు చేస్తోంది. అయితే  ఈ నెట్ వర్క్ పై కాల్స్ మాత్రం జీవితకాలం ఉచితమే.  కేవలం 170 రోజుల్లో 10 కోట్ల మంది యూజర్లను కూడా సొంతం చేసుకుంది. కానీ ఇటీవల కాలంలో సబ్ స్క్రైబర్ బేస్ యాడ్ చేసుకోవడంలో కంపెనీ కాస్త నెమ్మదించింది. జియో దెబ్బకు ఓ వైపు నుంచి టెలికాం దిగ్గజాలు భారీగా రెవెన్యూలు కోల్పోతున్నాయి. ఆ కంపెనీలు ప్రకటించే ఫలితాల్లో జియో వల్ల భారీగా నష్టాలను మూటగట్టుకుంటున్నట్టు ప్రకటిస్తున్నాయి.   
 
మరిన్ని వార్తలు