ఆదాయంలోనూ రిలయన్స్‌ టాప్‌

22 May, 2019 00:09 IST|Sakshi

అత్యధిక టర్నోవర్‌ కలిగిన కంపెనీగా గుర్తింపు

2018–19లో రూ.6.23 లక్షల కోట్ల ఆదాయం

రెండో స్థానంలోకి ఐవోసీ; ఆదాయం రూ.6.17 లక్షల కోట్లు

లాభంలోనూ తొలి స్థానంలో ఆర్‌ఐఎల్‌; రూ.39,588 కోట్లు  

మార్కెట్‌ క్యాప్‌లో ఇంతకుముందే తొలి స్థానం

రుణ భారం, నగదు నిల్వల్లోనూ ఆర్‌ఐఎల్‌ ముందంజ  

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మరో ఘనతను చాటుకుంది. ఆదాయం పరంగా ప్రభుత్వరంగంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ను (ఐవోసీ) అధిగమించి దేశంలో అగ్ర స్థానానికి చేరుకుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌ఐఎల్‌ రూ.6.23 లక్షల కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. పోటీ సంస్థ ఐవోసీ టర్నోవర్‌ 6.17 లక్షల కోట్లుగానే ఉంది. ఇక లాభం విషయంలోనూ నంబర్‌ 1 రిలయన్స్‌ ఇండస్ట్రీలే కావడం గమనార్హం. ఐవోసీ లాభంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్‌ రెట్టింపు స్థాయింలో రూ.39,588 కోట్లను నమోదు చేసింది. ఐవోసీ నికర లాభం 17,274 కోట్లకే పరిమితం అయింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.22,189 కోట్లతో పోలిస్తే 23 శాతం క్షీణించింది. కానీ, అదే సమయంలో ఆర్‌ఐఎల్‌ లాభంలో 13 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం.   మార్కెట్‌ విలువ పరంగా ఇప్పటికే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దేశంలో టాప్‌ కంపెనీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో టీసీఎస్‌తో తరచూ పోటీ పడుతూ ఉంటుంది. దశాబ్దం క్రితం ఐవోసీ సైజులో ఆర్‌ఐఎల్‌ సగం మేరే ఉండేది. ఈ మధ్య కాలంలో టెలికం, రిటైల్, డిజిటల్‌ సేవలు వంటి వినియోగ ఆధారిత వ్యాపారాల్లోకి రిలయన్స్‌ పెద్ద ఎత్తున విస్తరించడం అగ్ర స్థానానికి చేరుకునేందుకు దోహదపడింది. గతేడాది వరకు ఐవోసీ ప్రభుత్వరంగంలో అత్యంత లాభదాయకత కలిగిన కంపెనీగా ఉండగా, 2018–19లో ఓఎన్‌జీసీ ఈ స్థానాన్ని ఆక్రమించుకుంది. ఓఎన్‌జీసీ మార్చి క్వార్టర్‌ ఫలితాలను ఇంకా ప్రకటించాల్సి ఉండగా, డిసెంబర్‌ నాటికే 9 నెలల్లో రూ.22,671 కోట్ల లాభం సొంతం చేసుకుంది. ఈ ప్రకారం చూసినా ఐవోసీని వెనక్కి నెట్టేసినట్టే అనుకోవాలి. ఐవోసీ ఆదాయం ఆయిల్‌ రిఫైనరీ, పెట్రోకెమికల్స్, గ్యాస్‌ వ్యాపారాలపై ఆధారపడి మారుతూ ఉంటుంది.

ఏ విధంగా చూసినా..
తాజా రికార్డులతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మూడు రకాలుగా... ఆదాయం, లాభం, మార్కెట్‌ విలువ పరంగా మెరుగైన స్థానంలో, దేశంలో  నంబర్‌1గా ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఆర్‌ఐఎల్‌ ఆదాయం 2018–19లో అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే 44 శాతం వృద్ధి చెందింది. అదే ప్రధానంగా ఐవోసీని రెండో స్థానానికి నెట్టేసేందుకు ఉపయోగపడింది. 2010–19 మధ్య వార్షికంగా ఆర్‌ఐఎల్‌ ఆదాయ వృద్ధి 14 శాతం ఉండడం గమనార్హం. ఇక ఐవోసీ ఆదాయం 2018–19లో 20 శాతం వృద్ధిని నమోదు చేయగా, 2010–19 మధ్య వార్షికంగా 6.3 శాతం పెరుగుతూ వచ్చింది. మంగళవారం నాటి స్టాక్‌ క్లోజింగ్‌ ధర ప్రకారం ఆర్‌ఐఎల్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ.8.52 లక్షల కోట్లు. ఇక గమనించాల్సిన మరో అంశం... మరే కంపెనీకి లేని విధంగా ఆర్‌ఐఎల్‌ వద్ద రూ.1.33 లక్షల కోట్ల నగదు నిల్వలు ఉండడం. అంతే కాదండోయ్‌... స్థూల రుణ భారం విషయంలోనూ ప్రముఖ స్థానం రిలయన్స్‌దే కావడం విశేషం. 2019 మార్చి నాటికి రూ.2.87 లక్షల కోట్ల రుణాలు ఆర్‌ఐఎల్‌ తీసుకుని ఉంది. ఐవోసీ రుణ భారం రూ.92,700 కోట్లు. 

మరిన్ని వార్తలు