ధనాధన్‌ రిలయన్స్‌!

20 Jul, 2019 05:45 IST|Sakshi

క్యూ1 లాభం రూ.10,104 కోట్లు

6.8 శాతం వృద్ధి

రికార్డుస్థాయిలో ఆదాయం; రూ.1,72,956 కోట్లు

టెలికం, రిటైల్‌ వ్యాపారాల దన్ను...

తగ్గిన రిఫైనింగ్‌ మార్జిన్లు...

న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ అగ్రగామి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) అంచనాలను మించిన ఫలితాలతో అదరగొట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(2019–20, క్యూ1)లో కంపెనీ కాన్సాలిడేటెడ్‌ నికర లాభం(అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) రూ.10,104 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.9,459 కోట్లతో పోలిస్తే 6.8 శాతం వృద్ధి చెందింది. ప్రధానంగా కన్సూమర్‌ వ్యాపారాలైన రిటైల్, టెలికం విభాగాలు మంచి పనితీరు కంపెనీ లాభాల జోరుకు దోహదం చేసింది. ఈ రెండు విభాగాల స్థూల లాభం గతేడాది క్యూ1లో కంపెనీ మొత్తం స్థూల లాభంలో నాలుగో వంతు కాగా, ఈ ఏడాది క్యూ1లో ఇది మూడో వంతుకు(32 శాతం) చేరుకోవడం విశేషం. ఇదో కొత్త రికార్డు. ఈ  ఇక మొత్తం ఆదాయం రికార్డు స్థాయిలో రూ.1,72,956 కోట్లుగా నమోదైంది. గతేడాది క్యూ1లో ఆదాయం రూ.1,41,699 కోట్లతో పోలిస్తే 22 శాతం దూసుకెళ్లింది. మార్కెట్‌ విశ్లేషకులు రూ.9,852 కోట్ల నికర లాభాన్ని, రూ.1.43 లక్షల కోట్ల ఆదాయాన్ని అంచనా వేశారు.

సీక్వెన్షియల్‌గా చూస్తే...
గతేడాది చివరి త్రైమాసికం(క్యూ4)లో ఆర్‌ఐఎల్‌ నికర లాభం రూ. 10,362 కోట్లుగా నమోదైంది. అంటే సీక్వెన్షియల్‌గా చూస్తే క్యూ1లో లాభం 2.5%   తగ్గింది. అయితే, ఆదాయం మాత్రం రూ.1,54,110 కోట్లతో(క్యూ4) పోలిస్తే 12.2 శాతం పెరిగింది.

జీఆర్‌ఎం తగ్గుముఖం...
రిలయన్స్‌ స్థూల రిఫైనింగ్‌ మార్జిన్లు (జీఆర్‌ఎం) ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 8.1 డాలర్లకు తగ్గాయి.  18 త్రైమాసికాల్లో ఇదే అత్యంత తక్కువ జీఆర్‌ఎం కావడం గమనార్హం. గతేడాది ఇదే కాలంలో జీఆర్‌ఎం 10.5 డాలర్లు కాగా, క్రితం త్రైమాసికం (క్యూ4)లో ఇది 8.2 డాలర్లు. ఒక్కో బ్యారెల్‌ ముడిచమురును పెట్రో ఉత్పత్తులుగా మార్చడం ద్వారా  వచ్చే రాబడిని జీఆర్‌ఎంగా వ్యవహరిస్తారు.

కొనసాగుతున్న జియో జోరు...
దేశీ టెలికం రంగంలో రిలయన్స్‌ జియో హవా కొనసాగుతోంది. ఈ విభాగం నికర లాభం క్యూ1లో ఏకంగా 45.6 శాతం వృద్ధి చెంది రూ.891 కోట్లకు చేరింది. క్రితం ఏడాది క్యూ1లో లాభం రూ.612 కోట్లుగా నమోదైంది. ఆదాయం 44 శాతం వృద్ధితో రూ.11,679 కోట్లను తాకింది. యూజర్ల సంఖ్య పరంగా దేశంలో రెండో అతిపెద్ద టెలికం సంస్థగా ఉన్న జియో.. మొత్తం వినియోగదారుల సంఖ్య ఈ ఏడాది జూన్‌ చివరినాటికి 33.13 కోట్లకు చేరింది. కొత్తగా 2.46 కోట్ల మంది యూజర్లు ఏప్రిల్‌–జూన్‌ కాలంలో జతయ్యారు. మార్చి చివరినాటికి యూజర్ల సంఖ్య 30.67 కోట్లు. ఇక క్రితం క్వార్టర్‌(జనవరి–మార్చి)లో ఒక్కో యూజర్‌ నుంచి లభించిన ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ.126.2 ఉండగా.. తాజా క్వార్టర్‌(ఏప్రిల్‌–జూన్‌)లో ఇది రూ.122కు తగ్గింది. గతేడాది ఇదే కాలంలో ఏఆర్‌పీయూ రూ.134.3గా నమోదైంది.

ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు...
► రిలయన్స్‌ పెట్రోకెమికల్స్‌ విభాగం ఆదాయం క్యూ1లో రూ. 37,611 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ.40,287 కోట్లతో పోలిస్తే 6.6 శాతం తగ్గింది.

► రిఫైనింగ్‌ విభాగం ఆదాయం జూన్‌ క్వార్టర్‌లో 6.3% వృద్ధితో రూ.1,01,721 కోట్లకు పెరిగింది. గతేడాది క్య1లో ఆదాయం రూ. 95,646 కోట్లు.

► కంపెనీ రిటైల్‌ విభాగం స్థూల లాభం ఈ ఏడాది క్యూ1లో రూ.2,049 కోట్లను తాకింది. గతేడాది క్యూ1లో రూ.1,206 కోట్లతో పోలిస్తే 70 శాతం వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 47.5 శాతం వృద్ధితో రూ. 25,890 కోట్ల నుంచి రూ. 38,196 కోట్లకు ఎగసింది. దేశవ్యాప్తంగా 6,700 పట్టణాలు, నగరాల్లో రిలయన్స్‌ రిటైల్‌ 10,644 స్టోర్లను నిర్వహిస్తోంది. క్యూ1లో 229 కొత్త స్టోర్లు జతయ్యాయి. 10 కోట్ల మంది రిజిస్టర్డ్‌ కస్టమర్ల మైలురాయిని అధిగమించింది. జూన్‌ క్వార్టర్‌లో 15 కోట్ల మంది తమ స్టోర్లను సందర్శించినట్లు కంపెనీ పేర్కొంది.

► జూన్‌ చివరికి ఆర్‌ఐఎల్‌ మొత్తం రుణ భారం రూ.2,88,243 కోట్లకు పెరిగింది. మార్చి నాటికి రుణాలు రూ.2,87,505 కోట్లు. కాగా, కంపెనీ వద్దనున్న నగదు నిల్వలు రూ.1,33,027 కోట్ల నుంచి రూ.1,31,710 కోట్లకు తగ్గాయి.

రిలయన్స్‌ షేరు ధర శుక్రవారం బీఎస్‌ఈలో 1 శాతం నష్టంతో 1,249 వద్ద ముగసింది. మార్కెట్లో ట్రేడింగ్‌ ముగిసిన తర్వాత కంపెనీ ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి.  

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పటికీ ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పటిష్టమైన లాభాలను సాధించాం. జియో సేవల్లో అంచనాలను మించి వృద్ధి కొనసాగుతోంది. రిటైల్‌ వ్యాపారంలో ఆదాయం భారీగా ఎగబాకింది. దేశవాసులకు చౌక ధరల్లో అత్యంత అధునాతన డిజిటల్‌ సేవలను అందించేందుకు జియో యాజమాన్యం ప్రధానంగా దృష్టిసారిస్తోంది. డిమాండ్‌కు అనుగుణంగా నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని భారీగా పెంచుతున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న భారీ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ద్వారా కంపెనీలకు కొత్త తరం కనెక్టివిటీ సేవలను ఆరంభించాం. జియో గిగా ఫైబర్‌ ప్రయోగాత్మక సేవలు విజయవంతమయ్యాయి. 5 కోట్ల గృహాలు లక్ష్యంగా త్వరలోనే ఈ సేవలను మొదలుపెట్టనున్నాం.
– ముకేశ్‌ అంబానీ, ఆర్‌ఐఎల్‌ సీఎండీ  

టవర్స్‌ వ్యాపారంలో వాటా విక్రయం...
బ్రూక్‌ఫీల్డ్‌ రూ.25,215 కోట్ల పెట్టుబడి  
రిలయన్స్‌ తన టవర్ల వ్యాపారంలో వాటాను విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. కెనడా ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజం బ్రూక్‌ఫీల్డ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌కు చెందిన బీఐఎఫ్‌ ఫోర్‌ జార్విస్‌ ఇండియాతో ఈ మేరకు తమ అనుబంధ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ హోల్డింగ్స్‌ (ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌) ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. డీల్‌లో భాగంగా బ్రూక్‌ఫీల్డ్‌ (సహ–ఇన్వెస్టర్లతో కలిసి) ఆర్‌ఐఐహెచ్‌ఎల్‌ స్పాన్సర్‌గా ఉన్న టవర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ట్రస్ట్‌లో రూ.25,215 కోట్ల పెట్టుబడి పెట్టనుందని వెల్లడించింది. జియోకు చెందిన టవర్ల నిర్వహణ సంస్థ రిలయన్స్‌ జియో ఇన్‌ఫ్రాటెల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఆర్‌జేఐపీఎల్‌) తాజాగా ట్రస్ట్‌కు 51% వాటాను బదలాయించింది. ఇప్పుడు బ్రూక్‌ఫీల్డ్‌ పెట్టుబడులను కొంత రుణభారాన్ని తీర్చడంతో పాటు ఆర్‌ఐఎల్‌ వద్ద నున్న మిగతా 49% వాటాను కొనుగోలు చేసేందుకు వాడుకోనున్నట్లు తెలిపింది.

 

మరిన్ని వార్తలు