ఆల్-టైమ్ హై: టెల్కోలకు షాకిచ్చిన జియో

5 Jun, 2017 11:23 IST|Sakshi
ఆల్-టైమ్ హై: టెల్కోలకు షాకిచ్చిన జియో
టెలికాం మార్కెట్ ను ఓ కుదుపు కుదిపేస్తున్న రిలయన్స్ జియో మరోసారి రికార్డు బద్దలు కొట్టింది. 4జీ నెట్ వర్క్ స్పీడులో టెల్కోలకు షాకిచ్చింది. ఆల్-టైమ్ హై డౌన్ లోడ్ స్పీడును రికార్డు చేసింది. సెకనుకు 19.12 మెగాబిట్ స్పీడుతో ఏప్రిల్ నెలలో టాప్ లో నిలిచిన రిలయన్స్ జియో, ఫాస్టెస్ట్ 4జీ నెట్ వర్క్ గా పేరుతెచ్చుకున్నట్టు ట్రాయ్ రిపోర్టు వెల్లడించింది. రియల్-టైమ్ బేసిస్ లో మై స్పీడు అప్లికేషన్ ద్వారా సేకరించిన డేటాతో డౌన్ లోడ్ స్పీడును ట్రాయ్ గణించింది. సాధారణంగా ఐతే, 16ఎంబీపీఎస్ స్పీడుతో ఒక బాలీవుడ్ సినిమాను ఐదు నిమిషాల్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
 
ఈ స్పీడు కంటే అత్యధిక మొత్తంలో జియో డౌన్ లోడ్ స్పీడు రికార్డైంది. వరుసగా నాలుగో నెలలోనూ రిలయన్స్ జియోనే ఈ స్పీడు చార్ట్ లో టాప్ లో నిలవడం విశేషం. మార్చి నెలలో జియో స్పీడు 18.48 ఎంబీపీఎస్. రిలయన్స్ జియో తర్వాత ఐడియా సెల్యులార్ నెట్ వర్క్ స్పీడు 13.70ఎంబీపీఎస్ కు పెరిగింది. వొడాఫోన్ నెట్ వర్క్ 13.38ఎంబీపీఎస్ ఉంది. నెలవారీ ట్రెండ్ ప్రకారం ట్రాయ్ పోర్టల్ లో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన భారతీ ఎయిర్ టెల్ ఏప్రిల్ నెలలో 10.15 ఎంబీపీఎస్ స్పీడును కలిగిఉంది. 
మరిన్ని వార్తలు