జియోకి ఆ గేమ్‌నే మార్చేసే సత్తా..!

13 Apr, 2018 12:31 IST|Sakshi

న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్‌లో దూసుకుపోతోన్న బిలీనియర్‌ ముఖేష్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ తన బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను ఈ ఏడాదే లాంచ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తోంది. జియో బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులు ఈ సెగ్మెంట్‌లో ఉన్న పోటీ వాతావరణాన్ని పూర్తిగా మార్చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని క్రెడిట్‌ రేటింగ్‌ కంపెనీ ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ చెప్పింది. ఈ కొత్త సర్వీసులతో పేరెంట్‌ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు అదనంగా 5 బిలియన్‌ డాలర్లను చేకూర్చనుందని సీఎల్‌ఎస్‌ఏ ఇండియా తెలిపింది. దీంతో రిలయన్స్‌ ఆదాయాలు ఈబీఐటీడీఏల తర్వాత రూ.40 బిలియన్లుగా ఉండనున్నాయని బ్రోకరేజ్‌ సంస్థ అంచనావేస్తుంది. 

గతంలో ఫైబర్‌-టూ-హోమ్‌లపై టెలికాం కంపెనీల ఎక్కువగా దృష్టిసారించేవి కావని, వైర్‌లెస్‌ బిజినెస్‌లపైనే ఎక్కువగా వృద్ధిని నమోదు చేయాలనుకునేవని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ కార్పొరేట్‌ రేటింగ్స్‌ సీనియర్‌ డైరెక్టర్‌ మెహుల్‌ సుఖ్‌వాలా చెప్పారు. కాగ, 2016లో టెలికాం మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి జియో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జియో ప్రభావంతో కొన్ని టెలికాం కంపెనీలు మూతపడగా.. మరికొన్ని కంపెనీలు విలీన బాట పట్టాయి. ఉచిత కాలింగ్‌, ఉచిత డేటా రూపంలో జియో ఈ ధరల యుద్ధానికి తెరతీసింది. 16 నెలల అనంతరం జియో తొలిసారి లాభాలను సైతం నమోదు చేసింది. 

ప్రస్తుతం బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల రంగంలోనూ తనదైన సత్తా చాటాలని జియో ప్లాన్‌ చేస్తోంది. ఇప్పటికే ఎంపిక చేసిన అర్బన్‌ ప్రాంతాల్లో ఉచితంగా హై-స్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను ఆఫర్‌ చేస్తోంది. 100ఎంబీపీఎస్‌ స్పీడు మొదలుకొని డేటా ప్లాన్లను అందించాలని జియో చూస్తోంది. ప్రస్తుతం బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందిస్తున్న సంస్థల కన్నా తక్కువ ధరలతో ఎక్కువ స్పీడుతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టు జియో చెప్పింది. 
 

మరిన్ని వార్తలు