త్వరలోనే రిలయన్స్‌ జియో చార్జీల పెంపు

20 Nov, 2019 04:38 IST|Sakshi

న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని టెలికం సంస్థ ‘రిలయన్స్‌ జియో’ త్వరలోనే చార్జీలను పెంచనున్నట్లు మంగళవారం ప్రకటించింది. వచ్చే కొద్ది వారాల్లోనే మొబైల్‌ ఫోన్‌ కాల్స్, డేటా చార్జీలను పెంచనున్నామని ప్రకటించిన కంపెనీ.. ఎంత మేర టారిఫ్‌ పెరగనుందనే అంశంపై నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొంది. మిగిలిన టెలికం దిగ్గజాలైన వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌ సోమవారమే పెంపు ప్రకటన చేయగా.. ఒక రోజు తరువాత జియో కూడా తన నిర్ణయాన్ని ప్రకటించింది. దేశీ టెలికం రంగాన్ని బలోపేతం చేసి వినియోగదారులకు ప్రయోజనాన్ని అందించడంలో భాగంగా టారిఫ్‌ను పెంచనున్నామని, జియో వివరణ ఇచ్చింది. దీని వల్ల డేటా వినియోగంపైన, డిజిటల్‌ అనుసరణపైన ప్రతికూల ప్రభావం ఉండబోదని వ్యాఖ్యానించింది.

జోరుగా కొత్త యూజర్లు...
సెప్టెంబర్‌లో కొత్తగా 69.83 లక్షల యూజర్లను జత చేసుకోవడంతో కంపెనీ మొత్తం చందాదారుల సంఖ్య 35.52 కోట్లకు చేరింది. ఎయిర్‌టెల్‌ 23.8 లక్షల యూజర్లను కోల్పోయింది.  సబ్‌స్క్రైబర్ల సంఖ్య 32.55 కోట్లుగా ఉంది. వోడాఫోన్‌ ఐడియా 25.7 లక్షల చందాదారులను కోల్పోయింది. ఈ సంస్థ యూజర్‌ బేస్‌ 37.24 కోట్లకు తగ్గింది.

మరిన్ని వార్తలు