జియో ఫైబర్‌ బ్రాడ్‌బాండ్‌ లాంచింగ్‌ రేపే: రిజిస్ట్రేషన్‌ ఎలా?

4 Sep, 2019 16:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం రంగంలో పలు సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్‌ జియో తన ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను రేపు (గురువారం, సెప్టెంబరు 5) ప్రతిష్టాత్మకంగా లాంచ్‌ చేయనుంది.  రిలయన్స్ జియో జిగాఫైబర్ పేరుతో ఈ సేవలను దేశవ్యాప్తంగా తీసుకురానుంది.  ఈ మేరకు జియో వెబ్‌సైట్ ద్వారా ఇప్పటికే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. జియో ఫైబర్ సేవల కోసం జియో వెబ్ సైట్‌లో అడ్రస్ తెలిపి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వుంటుంది.  దేశంలోని 1600 పట్టణాల నుంచి 15 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు  పూర్తయినట్టు సమాచారం.

జియో ఫైబర్ ప్లాన్స్ విషయానికి వస్తే.. ప్రీమియం వినియోగదారులకు ప్లాన్‌లు నెలకు రూ. 700 నుంచి రూ. 10వేల వరకు ఉండనున్నాయి. ప్రస్తుతం జియో ఫైబర్ సేవలను ప్రీపెయిడ్ రూపంలో అందిస్తామని, భవిష్యత్‌లో పోస్ట్ పెయిడ్ సేవలను కూడా అందుబాటులోకి తెస్తామని జియో ఇటీవల తెలిపింది. జియో ఫైబర్ వెల్ కమ్ ఆఫర్ కింద వార్షిక ప్లాన్‌ను ఎంచుకున్న వినియోగదారులకు  ఫుల్ హెచ్‌డీ టీవీ లేదా 4కే టీవీ, 4కే సెట్ టాప్ బాక్సులను ఉచితంగా జియో అందించనుంది. అంతేకాదు జియో ఫైబర్ ‘జియో ఫస్ట్ డే ఫస్ట్ షో’ ప్లాన్ ను కూడా అందిస్తోంది. ఈ సదుపాయంతో జియో ఫైబర్ ప్రీమియం కస్టమర్లు కొత్త సినిమాలను థియేటర్ కు వెళ్లకుండానే, ఇంట్లో కూర్చొని వీక్షించవచ్చు. అయితే, ఈ సర్వీస్ 2020 మధ్యనాటికి అందుబాటులోకి రానుంది.

జియో ఫైబర్ కనెక్షన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి
రిలయన్స్ జియో ఫైబర్ లింక్‌కు వెళ్లండి.  జియో ఫైబర్‌ కనెక్షన్‌ను యాక్సెస్ చేయదలిచిన చోట మీ చిరునామాను (ఇల్లు లేదా కార్యాలయం) పేర్కొనాలి.
అనంతరం తరువాతి పేజీలో పేరు, మొబైల్ నంబర్ ఇమెయిల్ ఐడీ వంటి  వివరాలను నమోదు  చేయాలి.
ఈ ప్రక్రియ ముగిసాక, మీ  రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. దాన్ని  సంబంధిత బాక్స్‌లో ఎంటర్‌ చేయాలి. ఓటీపీ నిర్ధారించబడిన తర్వాత,  జియో సేల్స్‌ ప్రతినిధికి జియో ఫైబర్‌ కనెక్షన్‌ పొందడానికి అవసరమైన పత్రాన్ని (ఆధార్ కార్డు, ఓటరు ఐడి కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ లలో ఏదో ఒకదాన్ని) అందచేస్తే సరిపోతుంది. 

ఇటీవల 42వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) సందర్భంగా జియో ఫైబర్ బ్రాడ్‌బాండ్‌ వాణిజ్య సేవలను సెప్టెంబర్ 5న ప్రారంభించనున్నామని ఆర్‌ఐఎల్ చైర్మన్ ముకేశ్‌ అంబానీ  ప్రకటించిన సంగతి తెలిసిందే.

 చదవండి : ముకేశ్‌.. మెగా డీల్స్‌! 

జియో ఫైబర్‌ సంచలనం : బంపర్‌ ఆఫర్లు

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు