ఈ నెలలోనే రిలయన్స్ జియో?

22 Apr, 2016 01:38 IST|Sakshi
ఈ నెలలోనే రిలయన్స్ జియో?

కమర్షియల్ లాంచ్‌కు సన్నాహాలు
లైఫ్ మొబైల్ కస్టమర్లకు బండిల్ ఆఫర్లు

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ రిలయన్స్ జియో 4జీ ఎల్‌టీఈ సర్వీసులను వాణిజ్యపరంగా త్వరలో ప్రారంభిస్తోంది. అన్నీ అనుకూలిస్తే ఈ నెలలోనే మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ మేరకు రిలయన్స్ డిజిటల్ స్టోర్లతోపాటు మొబైల్ రిటైల్ ఔట్‌లెట్లకు సిమ్ కార్డులతోపాటు మైఫై ఉపకరణాల సరఫరాను జియో ప్రారంభించింది. కంపెనీ ఇప్పటికే సొంత బ్రాండ్ అయిన లైఫ్ మొబైల్స్‌ను విక్రయిస్తోంది. త్వరలో 4జీ సేవలు ప్రారంభం కానున్నాయని, అందుకు సిద్ధంగా ఉండాలని జియో తన భాగస్వాములకు సమాచారం అందించింది కూడా. నెట్‌వర్క్ అనుసంధాన ప్రక్రియ దేశవ్యాప్తంగా దాదాపు పూర్తి అయింది. సంస్థ ఉద్యోగులు, పంపిణీదారులు 4జీ సేవలను వినియోగించుకుంటున్నారు. ఇటీవలే హైదరాబాద్‌తోపాటు పలు నగరాల్లో క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా స్టేడియంలో ఉచిత వైఫై అందించి వీక్షకులను ఆకట్టుకుంది. మార్కెట్లో ఉన్న సగటు వేగం కంటే మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ 40-80 రెట్లు అధికంగా అందిస్తామని సంస్థ అధినేత ముకేష్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ జియో ఇప్పటి వరకు రూ.1,50,000 కోట్లను వెచ్చించింది.

 బండిల్ ఆఫర్లు ఇలా..
లైఫ్ మొబైల్స్ అమ్మకాలను పెంచుకోవడంలో భాగంగా బండిల్ ఆఫర్లతో జియో సిద్ధమైంది. ప్రస్తుతం ఉద్యోగులు, పంపిణీదారులకు కంపెనీ నాలుగు సిమ్‌లను ఉచితంగా అందించింది. ప్రతి సిమ్‌పైన మూడు నెలలకుగాను 75 జీబీ డేటా, 9,000 ఎస్‌ఎంఎస్‌లు, 2,000 నిముషాల టాక్‌టైంను ఉచితంగా ఇస్తోంది. ఇదే రీతిన లైఫ్ మొబైల్ కస్టమర్లకు ప్యాకేజీ ఉండొచ్చని తెలుస్తోంది. సాధారణ పథకాలను 90 రోజుల కనీస కాల పరిమితితో 40-200 జీబీ ఉచిత డేటాతో ప్రవేశపెట్టనుంది. 40 జీబీతో మైఫై (మొబైల్ వైఫై) ప్లాన్స్ ధర రూ.700-800 ఉండే అవకాశం ఉంది. కంపెనీ ప్రస్తుతానికి ప్యాక్‌ల ధర ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇతర టెల్కోలకు దీటుగా ఉండనుంది. ముందుగా డేటా సేవలు మాత్రమే అమలయ్యే సూచనలు కనపడుతున్నాయి. అటు సర్వీసింగ్ కేంద్రాలను పెద్ద ఎత్తున జియో ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌లో 12 కేంద్రాలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు