మొత్తం బాకీలన్నీ మాఫీ చేయండి

2 Nov, 2019 05:28 IST|Sakshi

లేకపోతే జరిమానాలు, వడ్డీల భారమైనా తగ్గించండి

బకాయిల చెల్లింపునకు 2 ఏళ్ల మారటోరియం ఇవ్వండి

స్పెక్ట్రం, లైసెన్సు ఫీజులపై కేంద్రానికి సీవోఏఐ మరో లేఖ

న్యూఢిల్లీ: లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బకాయిలపై టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ తాజాగా మరోసారి కేంద్రానికి లేఖ రాసింది. టెలికం రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్‌–ఐడియాలతో పాటు మిగతా టెల్కోల మొత్తం పాత బకాయిలు (సుమారు రూ. 1.42 లక్షల కోట్లు) మాఫీ చేసేయాలని కోరింది. అలా కుదరకపోతే కనీసం వడ్డీలు, పెనాల్టీలు రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది.

గతంలో రాసిన లేఖకు అనుబంధంగా కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌కు సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ ఎస్‌ మాథ్యూస్‌ అక్టోబర్‌ 31న తాజా లేఖ రాశారు. కేంద్రం చెబుతున్నట్లుగా ఏజీఆర్‌ (సవరించిన స్థూల ఆదాయం) ఫార్ములాకు తగ్గట్లు పాత బకాయిలన్నింటిని లెక్కగట్టి, కేంద్రానికి చెల్లించాల్సిందేనంటూ సుప్రీం కోర్టు అక్టోబర్‌ 24న టెల్కోలను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం భారతి ఎయిర్‌టెల్‌ ఏకంగా రూ. 42,000 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా సుమారు రూ. 40,000 కోట్లు పైగా కట్టాల్సి రావొచ్చని అంచనా.

రింగ్‌ వ్యవధి 30 సెకన్లు..
టెలిఫోన్‌ రింగ్‌ అయ్యే వ్యవధిని నిర్దేశిస్తూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ నిర్ణయం తీసుకుంది. మొబైల్‌ ఫోన్లకైతే ఇది 30 సెకన్లుగాను, ల్యాండ్‌లైన్‌ ఫోన్లకు∙60 సెకన్లుగాను నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత నిబంధనలకు సవరణ చేసింది.

మరిన్ని వార్తలు