స్పెక్ట్రమ్ వేలం కోసం రూ.14,653 కోట్లు జమ

20 Sep, 2016 00:54 IST|Sakshi
స్పెక్ట్రమ్ వేలం కోసం రూ.14,653 కోట్లు జమ

700 మెగాహెడ్జ్ బ్యాండ్‌పై కన్నేసిన జియో

 న్యూఢిల్లీ: అక్టోబర్ 1 నుంచి జరగనున్న స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు వీలుగా టెలికం కంపెనీలు ధరావతు సొమ్మును జమ చేశాయి. అందరికంటే అధికంగా జియో రూ.6,500 కోట్లు జమ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా 22 సర్కిళ్లలో ఏ సర్కిల్‌లో అయినా, ఏ బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం అయినా బిడ్ దాఖలు చేసే అర్హత సాధించింది. ఈ మేరకు టెలికం శాఖ సోమవారం వివరాలు వెల్లడించింది. వొడాఫోన్ ఇండియా రూ.2,740 కోట్లు, ఐడియా రూ.2,000 కోట్లు, ఎయిర్‌టెల్ రూ.1,980 కోట్లు జమ చేశాయి. టాటా టెలీ రూ.1,000 కోట్లు, ఆర్‌కామ్ రూ.313 కోట్లు, ఎయిర్‌సెల్ రూ.120 కోట్లు ధరావతుగా సమర్పించాయి.

దేశవ్యాప్తంగా 700 మెగాహెడ్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం బిడ్ దాఖలు చేయాలంటే రూ.5,610 కోట్లు జమ చేయాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఒక్క జియో మాత్రమే దేశవ్యాప్తంగా ఈ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్ సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బ్యాండ్‌లో స్పెక్ట్రమ్ వేలం వేయడం దేశంలో ఇదే ప్రథమం. దేశవ్యాప్తంగా 700 మెగాహెడ్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ సొంతం చేసుకున్న సంస్థ రూ.57,425 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. స్పెక్ట్రమ్ వేలం ద్వారా రూ.5.63 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

మరిన్ని వార్తలు