స్పెక్ట్రం బరిలో 8 కంపెనీలు

17 Feb, 2015 02:41 IST|Sakshi
స్పెక్ట్రం బరిలో 8 కంపెనీలు

- రేసులో ఎయిర్‌టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియో  
- మార్చి 4న వేలం

న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరగబోయే టెలికం స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు 8 టెలికం కంపెనీలు బరిలో నిల్చాయి. బిడ్డింగ్‌ల దాఖలుకు ఆఖరు రోజైన సోమవారం నాడు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, ఆర్‌కామ్, రిలయన్స్ జియో, యూనినార్ సంస్థలు దరఖాస్తులు అందజేశాయి. ఎయిర్‌సెల్, టాటా టెలీసర్వీసెస్ కూడా బిడ్డింగ్‌లో పాల్గొంటున్నాయి.

అయితే, సీడీఎంఏ స్పెక్ట్రంనకు సంబంధించి సిస్టెమా శ్యామ్ టెలీ సర్వీసెస్ మాత్రం వైదొలిగింది. రిజర్వ్ ధర అధికంగా ఉండటంతో పాటు టెలికం విభాగంతో న్యాయవివాదం ఇందుకు కారణమని పేర్కొంది.  ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌తో పాటు వీడియోకాన్ కూడా వేలంలో పాల్గొనడం లేదు. ఆఖరు రోజు నాటికి ఎనిమిది దరఖాస్తులు వచ్చినట్లు టెలికం విభాగం అధికారి ఒకరు చెప్పారు. రిలయన్స్ జియో, యూనినార్, టాటా టెలీసర్వీసెస్, ఎయిర్‌సెల్ కూడా పోటీపడుతుండటంతో స్పెక్ట్రంనకు అధిక ధర వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. మార్చి 4న స్పెక్ట్రం వేలం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
 
ప్రస్తుతం వేలం వేయబోతున్న స్పెక్ట్రంలో సింహభాగం.. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ టెలికం వద్ద ఉంది. ఈ కంపెనీల లెసైన్సుల గడువు 2015-16తో ముగిసిపోనుంది. దీంతో ఇవి మొబైల్, ఇతర టెలికం సర్వీసులు అందించడం కొనసాగించాలంటే స్పెక్ట్రం కోసం బిడ్ చేయకతప్పని పరిస్థితి నెలకొంది.
 2జీ, 3జీ టెలికం సేవలకు ఉపయోగపడే స్పెక్ట్రం వేలం ద్వారా కనీసం రూ. 80,000 కోట్లు రాగలవని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రిజర్వ్ ధర బట్టి చూసినా 2,100 మెగాహెట్జ్ బ్యాండ్‌లో (3జీ సేవలకు ఉపయోగపడేది) కనిష్టంగా రూ. 17,555 కోట్లు, 800.. 900 .. 1,800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో (2జీ సేవలకు ఉపయోగపడేవి)  రూ. 64,840 కోట్లు రాగలవని అంచనా. ఈ మూడు బ్యాండ్లలో 380.75 మెగాహెట్జ్ స్పెక్ట్రంను, 2,100 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 5 మెగాహెట్జ్ స్పెక్ట్రంను ప్రభుత్వం వేలం వేస్తోంది.   2014 ఫిబ్రవరిలో వేలం నిర్వహించినప్పుడు కేంద్రం రూ. 62,162 కోట్లు సమీకరించింది.
 
రూ. 90 వేల కోట్ల అంచనా: క్రిసిల్
స్పెక్ట్రం వేలంతో ప్రభుత్వానికి రూ. 90,000 కోట్లు రాగలవని అంచనా వేస్తున్నట్లు క్రెడిట్ రేటింగ్ ఏజన్సీ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. కీలకమైన 900 మెగాహెట్జ్ స్పెక్ట్రంనకు భారీ డిమాండ్ ఉండగలదని తెలిపింది. పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో టారిఫ్‌లను పెంచే అవకాశం ఉండకపోవచ్చని పేర్కొంది.

మరిన్ని వార్తలు