రిలయన్స్‌ మరో సంచలనం : షార్ట్‌ ఫిల్మ్స్‌, సీరియల్స్‌

24 Jul, 2018 16:18 IST|Sakshi
ముఖేష్‌ అంబానీ ఫైల్‌ ఫోటో

న్యూఢిల్లీ : ఇప్పటికే టెలికాం మార్కెట్‌లో సంచలనాలు సృష్టించి బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్‌లో తన పాగా వేస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, మరో వినూత్న ఆవిష్కరణకు తెరతీస్తుంది. సొంతంగా ప్రొడక్షన్‌ హౌజ్‌ను ఏర్పాటు చేసేందుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీని ద్వారా షార్ట్‌ఫిల్మ్స్‌, సీరియల్స్‌ను నిర్మించాలని ఆర్‌ఐఎల్‌ భావిస్తోంది. అయితే ఈ షార్ట్‌ ఫిల్మ్స్‌, సీరియల్స్‌ కేవలం రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందించనుందట. కేవలం రిలయన్స్‌ జియో సబ్‌స్క్రైబర్స్‌ మాత్రమే వెబ్‌ సీరిస్‌లో వీటిని వీక్షించవచ్చని తెలిసింది. టెలికాం మార్కెట్లో పోటీని తట్టుకుని అగ్రస్థానాన్ని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. దీంతో తనకున్న 215 మిలియన్‌ వైర్‌లెస్‌ యూజర్‌ బేస్‌కు మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది చివరినాటికి వైర్డ్‌ బ్రాడ్‌బాండ్‌ సర్వీసులను ప్రారంభించాలనే లక్ష్యంతో కంపెనీ వుంది.

జియో సబ్‌స్క్రైబర్స్‌కు మాత్రమే కంటెంట్‌ అందించే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది. వచ్చే 6 నెలల్లో కొన్ని వెబ్‌సిరీస్‌లను రిలీజ్‌ చేసే అంచనాతో ఉన్నట్టు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది. టారిఫ్‌లు భారీగా తగ్గడంతో మొబైల్‌ డేటా వినియోగం అమాంతం పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో వీడియో స్ట్రీమింగ్‌ సర్వీసులైన నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియాలను వీక్షించే సంఖ్య ​కూడా భారీగా పెరిగింది. ఈ ప్లాట్‌ఫామ్‌లపై పలు షోలు కూడా చాలా ఫేమస్‌ అయ్యాయి. దీంతో సొంత ప్రొడక్షన్‌ హౌజ్‌ను ఏర్పాటు చేయాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిర్ణయించింది. దీని కోసం రిలయన్స్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌, స్క్రిప్‌రైటర్స్‌ను నియమించుకుంది. ఈ ప్రక్రియలోనే రిలయన్స్‌ అతిపెద్ద ప్రొడక్షన్‌ హౌజ్‌ను ప్రారంభించబోతుందని ఈ విషయం తెలిసిన ఓ వ్యక్తి చెప్పారు. ఎరోస్‌ గ్రూప్‌ మాజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ జ్యోతి దేశ్‌ పాండేను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తన మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌కు అధిపతిగా నియమించుకుందని తెలిసింది. తాజాగా 20 నుంచి 25 మంది క్రియేటివ్‌ వ్యక్తులు కూడా బోర్డులో జాయిన్‌ అయ్యారు. మీడియా ఆర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ విజ్లింగ్ వుడ్స్‌ ఇంటర్నేషనల్‌తో జియో భాగస్వామ్యం కూడా ఏర్పరుచుకుంది. రిలయన్స్‌ త్వరలో కంటెంట్‌ ఆఫరింగ్‌ కోసం మరికొన్ని టేకోవర్లు చేసే యోచనలో ఉందని తెలిసింది.


 

>
మరిన్ని వార్తలు