రైల్వేకు సర్వీస్‌ ప్రొవైడర్‌గా జియో

22 Nov, 2018 01:12 IST|Sakshi

జనవరి 1 నుంచి అమల్లోకి   రైల్వేకు 35 శాతం ఆదా 

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వేకు టెలికం సేవల ప్రొవైడర్‌ అవకాశాన్ని రిలయన్స్‌ జియో సొంతం చేసుకుంది. వచ్చే జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. దీనివల్ల రైల్వే టెలిఫోన్‌ బిల్లుల భారం కనీసం 35 శాతం మేర తగ్గి పోతాయని అధికారులు తెలిపారు. భారతీయ రైల్వేకు గత ఆరేళ్లుగా భారతీ ఎయిర్‌టెల్‌ టెలికం సేవలు అందిస్తోంది. 1.95 లక్షల మొబైల్‌ ఫోన్‌ కనెక్షన్లను సీయూజీ కింద రైల్వే ఉద్యోగులు వినియోగిస్తున్నారు. ఇందు కోసం ఏటా రూ.100 కోట్లను ఎయిర్‌టెల్‌కు రైల్వే చెల్లిస్తోంది. ఇరు సంస్థల మధ్య ఒప్పందం గడువు డిసెంబర్‌ 31తో ముగిసిపోతోంది. దీంతో తాజా సీయూజీ పథకాన్ని నిర్ణయించే బాధ్యతను రైల్వే శాఖ రైల్‌టెల్‌ సంస్థకు అప్పగించింది.

దీంతో నూతన సీయూజీ పథకాన్ని అందించేందుకు రిలయన్స్‌ జియోను రైల్‌టెల్‌ ఖరారు చేసింది. జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తన ఆదేశాల్లో పేర్కొంది. రూ.125 నెలసరి అద్దెపై ప్రతీ నెలా 60జీబీ డేటా (పై స్థాయిలోని సీనియర్‌ ఉద్యోగులు), రూ.99 ప్లాన్‌పై ప్రతీ నెలా 45జీబీ, రూ.67 అద్దెపై 30జీబీ (గ్రూపు సి ఉద్యోగులకు) జియో అందించనుంది. ఈ ప్లాన్లలో కాల్స్‌ ఉచితం. దీనికి తోడు బల్క్‌ ఎస్‌ఎంఎస్‌ల ప్లాన్‌కు రూ.49 చార్జ్‌ చేయనుంది.అదనపు 2జీబీ డేటాకు రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. ఇక సీయూజీ వెలుపల నంబర్లకు చేసే కాల్స్‌కు ప్రస్తుతం చార్జీలను ఉద్యోగులు చెల్లించాల్సి వస్తోంది. జియో ప్లాన్లలో ఈ చార్జీలు ఉండవు. 

మరిన్ని వార్తలు