‘జియో’ను ఎదుర్కోవడం ఎలా..?

3 Sep, 2016 00:35 IST|Sakshi
‘జియో’ను ఎదుర్కోవడం ఎలా..?

కొత్త వ్యూహాల్లో టెల్కోలు... వినూత్నమైన ప్లాన్ల ప్రకటన
డేటా చార్జీల్లో కోతలు తప్పవు
బండిల్ ఆఫర్ల జోరు పెరుగుతుంది
బ్రోకరేజ్ సంస్థల నివేదికలు

 న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన ప్రివ్యూ ఆఫర్‌తో టెలికం రంగంలోని దిగ్గజ కంపెనీలకు చుక్కలు చూపెడుతోంది. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభం కాకమునుపే పరిస్థితి ఇలా ఉందంటే.. జనవరిలో పూర్తిస్థాయిలో జియో మార్కెట్‌లోకి అడుగుపెడితే? దీనికి సమాధానమివ్వడం కొంత కష్టమే. జియో ప్రివ్యూ ఆఫర్ దెబ్బకు ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సంస్థలు ఇప్పటికే ఉన్న డేటా ప్యాక్స్‌కు అదనపు డేటాను అందిస్తున్నాయి. కొత్త యూజర్లను ఆకట్టుకోవడం పక్కన ఉంచితే.. ఉన్నవారిని జారిపోకుండా చూసుకోవడానికి తెగ శ్రమిస్తున్నాయి. దీంతో టెల్కోలు ఇప్పటికే డేటాతోపాటు ఉచిత కాల్స్‌తో కూడిన వినూత్నమైన ఆఫర్లనూ ప్రకటిస్తున్నాయి. టెల్కోలు.. హ్యాండ్‌సెట్స్ కంపెనీలతో కలసి ప్రకటించే బండిల్ ఆఫర్ల జోరు పెరుగుతుందని పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు.

 మెగా సేవర్ ప్యాక్స్ ధర మరింత తగ్గొచ్చు!
ప్రస్తుతం ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ కంపెనీలు వాటి ప్రి-పెయిడ్ ఇంటర్నెట్ ప్యాక్స్‌పై అధిక డేటాను అందిస్తున్నాయని యూబీఎస్ పేర్కొంది. తమ లెక్కల ప్రకారం సాంప్రదాయ ప్లాన్స్‌తో పోలిస్తే మెగా సేవర్ ప్యాక్స్ త్వరలో 35-40 శాతం మరింత తక్కువ ధరకే అందుబాటులో రావొచ్చని తెలిపింది. ‘రిలయన్స్ జియో రాకతో 4జీ డేటా వినియోగం బాగా పెరుగుతుంది. దీనికి తక్కువ డేటా చార్జీలతో కూడిన ప్లాన్స్, చౌక ధరల 4జీ హ్యాండ్‌సెట్స్ వంటి అంశాలు కారణంగా నిలుస్తాయి’ అని వివరించింది.

ఉచిత కాలింగ్‌తో బండిల్ ప్లాన్స్?
జియో సేవలు త్వరలో ప్రారంభం కానుండటంతో ఎయిర్‌టెల్ సహా ఇతర కంపెనీలు డేటా చార్జీలను తగ్గించే అవకాశముందని జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది. టెల్కోలు డేటాతోపాటు ఉచిత కాలింగ్ ఫీచర్‌తో కూడిన బండిల్ ప్లాన్స్ అందించొచ్చని పేర్కొంది. జియోతో పోటీపడటానికి ఇతర కంపెనీలు ఎలాంటి ఆఫర్లను ప్రకటిస్తాయో చూడాల్సి ఉందని వివరించింది. కాగా టెల్కోలు ప్రస్తుతం రూ.9 నుంచి (20 ఎంబీ, 28 రోజుల వ్యాలిడిటీ) డేటా ప్లాన్స్‌ను అందిస్తున్నాయని క్రెడిట్ సూచీ పేర్కొంది. దీనికి మార్కెట్‌లోకి కొత్త సంస్థ అడుగుపెట్టడం కారణం కావొచ్చని అభిప్రాయపడింది.  

ఎయిర్‌టెల్ వ్యూహాలు మెరుగు
రిలయన్స్ జియో సేవల ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకొని ఎయిర్‌టెల్ వ్యవహరిస్తోన్న విధానాలు మెరుగ్గా వున్నాయని యూబీఎస్ పేర్కొంది. టారిఫ్ ధరలను తగ్గించకుండా అదనపు డేటా అందించడం, రూ.1,498 ముందస్తు చెల్లింపుతో రూ.51లకే 1 జీబీ డేటా వంటి ప్లాన్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. కస్టమర్లను నిలుపుకోవడానికి ఇలాంటి  చర్యలు దోహదపడతాయని తెలిపింది. వీటి వ ల్ల డేటా వినియోగం కూడా పెరుగుతుందని పేర్కొంది.

 జియోని నిలువరిస్తాయా?
రిలయన్స్ జియోని ప్రస్తుత దిగ్గజ టెల్కోలు ఎలా ఎదుర్కొంటాయనేది ఆసక్తికరంగా మారిందని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. జియో ఇప్పటికే రూ.50లకే 1 జీబీ డేటా వంటి పలు వినూత్నమైన ఆఫర్లను ప్రకటించింది. ‘సంస్థ ప్రివ్యూ ఆఫర్ కింద ఉచిత సిమ్‌తో 4 నెలలు అపరిమిత డేటా, వాయిస్ సేవలను అందిస్తోంది. దీనికి మార్కెట్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. వచ్చే రెండేళ్లలో జియో యూజర్ల సంఖ్య 3.5 కోట్లకు చేరొచ్చు’ అని వివరించింది. దీని దెబ్బకి ఇతర టెల్కోల డేటా వినియోగం వృద్ధి 70% నుంచి 50 శాతానికి తగ్గొచ్చని పేర్కొంది.

నాణ్యమైన టెలికం సేవలు కావాలి: సర్వే
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో దెబ్బకి టెలికం కంపెనీలు టారిఫ్ ధరలపై ప్రధానంగా దృష్టికేంద్రీకరించాయి. అందులో భాగంగానే టారిఫ్ ధరలను తగ్గిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో తక్కువ టారిఫ్ ధరలు మంచిదేనని, వీటితోపాటు టెల్కోలు మెరుగైన సేవలను అందిస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విషయం ‘లోకల్‌సర్కిల్’ అనే ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడయ్యింది. సర్వే ప్రకారం.. టెల్కోల డేటా సర్వీసులు చాలా పేలవంగా ఉన్నాయని 43 శాతం మంది పేర్కొన్నారు.

ఇక వాయిస్ సేవలు సంతృప్తికరంగా లేవని 27 శాతం మంది తెలిపారు. కాల్ డ్రాప్స్ విషయానికి వస్తే.. 53 శాతం మంది వారి ఆపరేటర్‌కు యావరేజ్ రేటింగ్‌ను ఇచ్చారు. ఇక టెలికం సంబంధిత సమస్యలను చక్కబెట్టడానికి నియంత్రణ సంస్థ ట్రాయ్ తగినంత కృషి చేయలేదని దాదాపు 77 శాతం మంది అభిప్రాయపడ్డారు. డౌన్‌లోడింగ్ వ్యయం ఎక్కువగా ఉందని 53 శాతం పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు