జూలైలో ‘జియో’ జోరు

19 Sep, 2019 02:48 IST|Sakshi

85.39 లక్షల నూతన సబ్‌స్క్రైబర్లు

న్యూఢిల్లీ : ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని ‘రిలయన్స్‌ జియో’ నూతన సబ్‌స్క్రైబర్లను జతచేసుకుంటూ జర్నీని కొనసాగించడంలో వాయువేగంతో దూసుకెళ్తోంది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) ప్రకటించిన తాజా సమాచారం ప్రకారం.. జూలైలో 85.39 లక్షల నూతన సబ్‌స్క్రైబర్లను జతచేసుకుంది. ఇటీవలే సబ్‌స్రై్కబర్ల పరంగా భారతీ ఎయిర్‌టెల్‌ను వెనక్కునెట్టి రెండవ స్థానానికి చేరిన ఈ సంస్థ.. అనతికాలంలోనే ఏకంగా 33.97 కోట్ల సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుంది. జూలై చివరినాటికి 0.2 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. మరోవైపు సునీల్‌ మిట్టల్‌ నేతృత్వంలోని భారతి ఎయిర్‌టెల్‌ (టాటా టెలిసర్వీస్‌తో సహా) 25.8 లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. ఈ సంస్థ బేస్‌ 32.85 కోట్లకు తగ్గిపోయింది. వొడాఫోన్‌ ఐడియా జూలైలో 33.9 లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. జూలై చివరినాటికి ఈ సంస్థ వినియోగదారుల సంఖ్య 38 కోట్లకు తగ్గినట్లు ట్రాయ్‌ తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ 2.88 లక్షల నూతన సబ్‌స్క్రైబర్లను జతచేసుకోవడంతో ఈ సంస్థ చందాదారుల సంఖ్య 11.6 కోట్లకు పెరిగింది.

5జీ కోసం చైనా టెల్కోలతో జట్టు 
టెలికం రంగంలో సంచలనం సృష్టించిన ‘రిలయన్స్‌ జియో’ 5జీ సేవలపై దృష్టిసారించింది. ఈ సేవలను అందించడంలో భాగంగా చైనా టెలికం సంస్థలతో జట్టుకట్టింది. ఓపెన్‌ టెస్ట్‌ అండ్‌ ఇంటిగ్రేషన్‌ సెంటర్‌ (ఓటీఐసీ) ఏర్పాటు కోసం ప్రముఖ టెలికం దిగ్గజ సంస్థలతో భేటీ అయినట్లు బుధవారం ప్రకటించింది. 5జీ నెట్‌వర్క్‌ సొల్యూషన్స్‌ అభివృద్ధి నిమిత్తం.. చైనా సంస్థలతో పాటు ఇతర దేశాల దిగ్గజ సంస్థలను సంప్రదించినట్లు తెలిపింది. చైనా మొబైల్, చైనా యునికామ్, ఇంటెల్, రాడిసిస్, శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్, ఎయిర్‌స్పాన్, లెనొవొ, రూజీ నెట్‌వర్క్, విండ్‌రివర్‌ వంటి సంస్థలతో చర్చలు జరిపినట్లు ప్రకటించింది.

మరిన్ని వార్తలు