రిలయన్స్‌ నిప్పన్‌...17% లాభంతో లిస్టింగ్‌

7 Nov, 2017 00:16 IST|Sakshi

స్టాక్‌మార్కెట్లో లిస్టయిన తొలి మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ  

ముంబై: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ (ఆర్‌ఎన్‌ఏఎమ్‌) షేర్లు స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌లో మెరుపులు మెరిపిం చినప్పటికీ, ఆ లాభాలను చివరి వరకూ కొనసాగించలేకపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో ఇష్యూ ధర రూ.252తో పోలిస్తే 17 శాతం లాభంతో రూ.296 వద్ద లిస్టయింది. ఆ తర్వాత ఇంట్రాడేలో రూ.299, రూ.278 గరిష్ట, కనిష్ట స్థాయిలను తాకింది. చివరకు 13 శాతం లాభంతో రూ.284 వద్ద ముగిసింది.

కంపెనీ మార్కెట్‌ విలువ రూ.17,381 కోట్లకు చేరింది. రూ.1,540 కోట్ల ఈ ఐపీఓ 82 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. స్టాక్‌ మార్కెట్లో లిస్టయిన తొలి మ్యూచువల్‌ ఫండ్‌ ఇదే. ఇక నిర్వహణ ఆస్తుల పరంగా చూస్తే, రూ.3.84 లక్షల కోట్ల ఆస్తులతో మూడో అతి పెద్ద మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీగా అవతరించింది.

మరిన్ని నిప్పన్‌ పెట్టుబడులు...: త్వరలో మరిన్ని రకాల మ్యూచువల్‌ ఫండ్స్‌ను అందించనున్నామని ఆర్‌ఎన్‌ఏఎమ్‌ సీఈఓ సందీప్‌ సిక్కా పేర్కొన్నారు. ప్రస్తుతం 135 నగరాల్లో 171 బ్రాంచీలున్నాయని, మూడేళ్లలో వీటిని 500కు పెంచనున్నామని వివరించారు. మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌ ఆకర్షణీయంగా ఉందని, పెట్టుబడులు కొనసాగిస్తామని నిప్పన్‌ లైఫ్‌  వైస్‌ చైర్మన్‌ తకెషి ఫ్యూరిచి చెప్పారు.

మరిన్ని వార్తలు