రిలయన్స్ లాభాల రికార్డ్

17 Oct, 2015 01:13 IST|Sakshi
రిలయన్స్ లాభాల రికార్డ్

క్యూ2లో రూ. 6,720 కోట్లు; 12.5 శాతం అప్
♦ 34% తగ్గిన ఆదాయం; రూ.75,117 కోట్లు
♦ 10.6 డాలర్లకు స్థూల రిఫైనింగ్ మార్జిన్...
♦ కలిసొస్తున్న క్రూడ్ ధరల పతనం...
 
 న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్ అగ్రగామి రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్)కు లాభాల పంట పండింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పతనం కారణంగా... రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ వ్యాపారంలో పటిష్టమైన మార్జిన్ల ఆసరాతో రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. అంచనాలను మించి.. ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2015-16, క్యూ2)లో కంపెనీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.6,720 కోట్ల లాభాన్ని ప్రకటించింది.  క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.5,972 కోట్లతో పోలిస్తే 12.5% ఎగబాకింది. రిలయన్స్ కంపెనీ చరిత్రలో ఒక క్వార్టర్‌లోఇదే అత్యధిక లాభం కావడం గమనార్హం. అయితే, క్రూడ్ క్షీణత ప్రభావంతో కంపెనీ మొత్తం ఆదాయం భారీగా దిగొచ్చింది. క్రితం ఏడాది క్యూ2లో రూ.1,13,396 కోట్లతో పోలిస్తే 34% తగ్గి... రూ.75,117 కోట్లకు చేరింది.

 కాగా, మార్కెట్ విశ్లేషకులు క్యూ2లో రిలయన్స్ సగటున రూ.6,000 కోట్ల నికర లాభాన్ని అంచనా వేశారు. అమెరికా షేల్ గ్యాస్ పైప్‌లైన్ వెంచర్‌లో వాటాను ఈఎఫ్‌ఎస్ మిడ్‌స్ట్రీమ్‌ను విక్రయం వల్ల లభించిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే క్యూ2 లాభంలో రూ.252 కోట్లు అదనంగా కలసిఉందని కంపెనీ తెలిపింది. దీన్ని తీసేస్తే లాభం రూ.6,468 కోట్లు కిందలెక్క. దీని ప్రకారం ఈ ఏడాది క్యూ1లో లాభం రూ.6,222 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా చూస్తే... ఈ క్యూ2లో 4 శాతం పెరిగింది.

 ఏడేళ్ల గరిష్టానికి జీఆర్‌ఎం...
 సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల రిఫైనింగ్ మార్జిన్(ఒక్కో బ్యారెల్ ముడిచమురును పెట్రోలియం ఉత్పత్తులుగా మార్చడం ద్వారా లభించే రాబడి- జీఆర్‌ఎం) కూడా 10.6 డాలర్లకు దూసుకెళ్లింది. ఇది ఏడేళ్ల గరిష్ట స్థాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో జీఆర్‌ఎం 8.3 డాలర్లు కాగా, ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో 10.4 డాలర్లు.

 ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
►{పధానమైన కేజీ-డీ6 చమురు-గ్యాస్ క్షేత్రాల్లో ఉత్పత్తి అట్టడుగు స్థాయిలోనే కొనసాగుతోంది. క్యూ2లో ఇక్కడి నుంచి 0.39 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్, 37 బిలియన్ ఘనపుటడుగుల(బీసీఎఫ్) సహజ వాయువు ఉత్పత్తి అయింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే గ్యాస్ ఉత్పత్తి 9 శాతం, ముడిచమురు ఉత్పత్తి 24 శాతం చొప్పున దిగజారింది. ముఖ్యంగా క్షేత్రాల్లో భౌగోళిక పరమైన అడ్డంకులు దీనికి కారణమని కంపెనీ పేర్కొంది.
►రిఫైనరీ వ్యాపారం పన్ను ముందు లాభం(ఎబిటా) 42.1 శాతం ఎగబాకి రూ. 5,461 కోట్లకు చేరింది. పెట్రోకెమికల్స్ వ్యాపార ఎబిటా 7.2 శాతం వృద్ధితో రూ.2,531 కోట్లుగా నమోదైంది.
►చమురు-గ్యాస్ వ్యాపార ఎబిటా 83.1 శాతం దిగజారి రూ.56 కోట్లకు పడిపోయింది.
►రిటైల్ వ్యాపార విభాగం జోరు కొనసాగుతోంది. క్యూ2లో రిలయన్స్ రిటైల్ మొత్తం ఆదాయం 22 శాతం ఎగబాకి రూ.5,091 కోట్లకు చేరింది. పన్ను ముందు లాభం రూ.186 కోట్ల నుంచి రూ. 210 కోట్లకు పెరిగింది. సెప్టెంబర్ చివరినాటికి కంపెనీ దేశవ్యాప్తంగా 250 నగరాల్లో 2,857 స్టోర్లను నిర్వహిస్తోంది.
►సెప్టెంబర్ చివరినాటికి కంపెనీ మొత్తం రుణ భారం రూ. 1,72,765 కోట్లుగా ఉంది. ఇక నగదు తత్సంబంధ నిల్వలు రూ.85,720 కోట్లుగా ఉన్నాయి.
►రిలయన్స్ షేరు ధర బీఎస్‌ఈలో 0.91% లాభంతో రూ.912 వద్ద ముగిసింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి.
 జియో ‘ఎల్‌వైఎఫ్’ 4జీ హ్యాండ్‌సెట్లు వస్తున్నాయ్...

 4జీ వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను వివిధ నగరాల్లో విజయవంతంగా పరీక్షించామని.. త్వరలోనే వాణిజ్యపరంగా సర్వీసులను ప్రారంభించనున్నట్లు  రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తెలిపింది. డిసెంబర్‌లో సర్వీసులు ఆరంభం కావచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే తమ సొంత బ్రాండ్ ‘ఎల్‌వైఎఫ్’ పేరుతో 4జీ హ్యాండ్‌సెట్‌ల విక్రయాన్ని ప్రారంభించనున్నట్లు(నవంబర్‌లో వచ్చే చాన్స్) కంపెనీ పేర్కొంది.

మరిన్ని వార్తలు