రిలయన్స్‌ రెగ్యులర్‌ సేవింగ్‌ ఫండ్‌

29 Jan, 2018 01:47 IST|Sakshi

ఇది బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌. ఈక్విటీలో ఎక్కువ శాతం పెట్టుబడులు పెడితే మార్కెట్లు కరెక్షన్‌కు లోనైనప్పుడు తమ పెట్టుబడుల విలువ కుంగిపోతుందన్న ఆందోళన ఉంటే దీన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే ఇది ఈక్విటీ, డెట్‌ల కలబోత. ముఖ్యంగా మార్కెట్లు అధిక స్థాయికి చేరిన తరుణంలో పూర్తి ఈక్విటీ పథకాలతో రిస్క్‌ ఎక్కువే ఉంటుంది. ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఆ రిస్క్‌ పరిమితం చేసుకోవచ్చు.

మరోవైపు గత ఏడాది ఆగస్ట్‌లో 25 బేసిస్‌ పాయింట్ల రెపో రేటు కోత తర్వాత ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పరంగా కఠిన, తటస్థ విధానాన్నే కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో మధ్యస్థాయి రిస్క్‌కు సిద్ధపడేవారు రిలయన్స్‌ రెగ్యులర్‌ సేవింగ్‌ తరహా బ్యాలెన్స్‌డ్‌ ఫండ్లను పెట్టుబడులకు పరిశీలించొచ్చు. రిస్క్‌తో కూడిన సాధనాల్లో పెట్టుబడులను కొంత మేర బ్యాలెన్స్‌డ్‌ ఫండ్లలోకి మళ్లించడం కూడా వివేకమే.  

రిస్క్‌ బ్యాలెన్స్‌
బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌ ప్రధానంగా లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. డెట్‌ పోర్ట్‌ఫోలియోకు సంబంధించి అక్రూయెల్‌ స్ట్రాటజీ (క్రెడిట్‌ రేటింగ్‌ మెరుగుపడే అవకాశం ఉన్న వాటిలో ఇన్వెస్ట్‌ చేయడం) పాటిస్తుంటాయి. రిలయన్స్‌ రెగ్యులర్‌ సేవింగ్స్‌ ఫండ్‌ – బ్యాలెన్స్‌డ్‌ కూడా ఇదే తరహా పథకమే. హైబ్రిడ్‌ ఈక్విటీ తరహా కేటగిరీలోకి వస్తుంది. పథకం కింద సమీకరించే నిధుల్లో 65 శాతం మేర ఈక్విటీలకు కేటాయిస్తుంది.

లార్జ్‌క్యాప్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే పథకం కావడంతో మార్కెట్లలో అనూహ్య ఆటు పోట్లు ఎదురైనా తట్టుకునే విధంగా మెరుగైన స్థానంలో ఉంది. ఈ కేటగిరీలోనే మంచి పనితీరు చూపిస్తున్న ఇతర పథకాలు... హెచ్‌డీఎఫ్‌సీ ప్రుడెన్స్‌ ఫండ్, ప్రిన్సిపల్‌ బ్యాలెన్స్‌డ్‌ ఫండ్, యూటీఐ బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌లు మాత్రం స్మాల్, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టే విధానాన్ని అనుసరిస్తున్నాయి.  

పోర్ట్‌ఫోలియో, పనితీరు
ఈ పథకం పనితీరు 2013–16 మధ్య కాలంలో ఆశించిన మేర లేదు. ఎందుకంటే ఆ సమయంలో మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ర్యాలీ చేయడంతో రాబడుల విషయంలో మిగిలిన పథకాలతో పోలిస్తే వెనుకబడింది. కారణం ఎక్కువ పెట్టుబడుల్ని లార్జ్‌క్యాప్‌కు కేటాయించడమే. కానీ, 2017లో తిరిగి రాబడుల పరంగా మంచి స్థానానికి చేరుకుంది. టాప్‌–3 పథకాల్లో ఒకటిగా నిలిచింది. బ్యాంకు స్టాక్స్‌కు అధిక కేటాయింపులతో గత 10 సంవత్సరాల కాలంలో ఏటా 12 శాతం చొప్పున కాంపౌండెడ్‌ రాబడులను అందించింది.

పెట్టుబడులను రక్షించుకోవడంతోపాటు రిస్క్‌ను పరిమితం చేసే విధంగా ఈ పథకం విధానం ఉంటుంది. గత ఐదేళ్లలో పరిశీలిస్తే ఈక్విటీలకు కేటాయింపులను 72 శాతం స్థాయిలో కొనసాగిస్తూ వస్తోంది. ప్రస్తుతం పథకం పరిధిలోని మొత్తం నిధుల్లో 70 శాతం ఈక్విటీలకు కేటాయించగా, అందులో 83 శాతం లార్జ్‌క్యాప్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేసింది. మిగిలిన 17 శాతం నిధుల్ని మిడ్, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో పెట్టుబడులుగా పెట్టింది. ఇన్విట్‌లకు 2 శాతం కేటాయించడం గమనార్హం. బ్యాంకులు, ఫైనాన్స్, ఆటో, సిమెంట్‌ రంగాల స్టాక్స్‌కు ప్రాధాన్యం ఇస్తోంది. రాబడుల విషయానికొస్తే ఏడాది కాలంలో 29 శాతం, మూడేళ్లలో 13.2 శాతం, ఐదేళ్లలో 16.4 శాతం, పదేళ్లలో 12 శాతం చొప్పున వార్షికంగా ప్రతిఫలం ఇచ్చింది.


ఈక్విటీలో టాప్‌ పెట్టుబడులు
కంపెనీ                    కేటాయింపులు (%)
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు       8.55
గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌           5.56
ఇన్ఫోసిస్‌                    4.37
ఐసీఐసీఐ బ్యాంకు         4.09
భారత్‌ ఫైనాన్షియల్‌        3.27
లార్సన్‌ అండ్‌ టుబ్రో       3.20
హెచ్‌డీఎఫ్‌సీ                2.61
ఆర్‌ఐఎల్‌                    2.38
కోటక్‌ మహీంద్రాబ్యాంకు   2.26
ఇండియన్‌ ఆయిల్‌        2.18

మరిన్ని వార్తలు