రికార్డుల మోత మోగిస్తున్న రిలయన్స్‌

13 Jul, 2020 12:33 IST|Sakshi

కొత్త ఆల్‌టైం హైని అందుకున్న షేరు ధర

రూ.12లక్షల కోట్లకు చేరిన మార్కెట్‌క్యాప్‌

జూన్‌ 15న కంపెనీ 43వ ఏజీఎం

షేరు టార్గెట్‌ ధర పెంచిన మోతీలాల్‌ ఓస్వాల్‌

 రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు సోమవారం ట్రేడింగ్‌లో కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. తన అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి విదేశీ సంస్థల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం ఇందుకు కారణమైంది. క్వాల్‌కామ్‌ వెంచర్స్‌ సం‍స్థ జియోలో 0.15శాతం వాటాను రూ.730 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ఆదివారం రిలయన్స్‌ ప్రకటించింది. ఫలితంగా నేడు బీఎస్‌ఈ రియలన్స్‌ షేరు రూ.1908.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో షేరు 3.64శాతం పెరిగి రూ.1947 వద్ద  ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధర షేరుకు కొత్త జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఉదయ గం.11:30ని.లకు షేరు క్రితం ముగింపు(రూ.1878.50)తో పోలిస్తే 3శాతం లాభంతో రూ.1935 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ మార్చి మార్కెట్‌ పతనం నుంచి రిలయన్స్‌ షేరు ఏకంగా 120శాతం ర్యాలీ చేసింది. ఈ వారంలో బుధవారం (ఈ నెల 15న) జరిగే రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 43వ ఏజీఎమ్‌(వార్షిక సాధారణ సమావేశం) కోసం ఇన్వెస్టర్లు ఆస్తకిగా ఎదురుచూస్తున్నారు. 

రూ.12లక్షల కోట్లకు చేరిన మార్కెట్‌క్యాప్‌: 
రిలయన్స్‌ షేరు కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకోవడంతో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.12లక్షల కోట్లకు చేరుకుంది. ఈ ఘనత సాధించిన తొలి కంపెనీగా రిలయన్స్‌ రికార్డుకెక్కింది. 

షేరు టార్గెట్‌ ధరను పెంచిన బ్రోకరేజ్‌లు:
ప్రముఖ బ్రోకరేజ్‌ సం‍స్థ మోతిలాల్‌ ఓస్వాల్‌ షేరు టార్గెట్‌ ధరను పెంచింది. గతంలో బ్రోకరేజ్‌ సంస్థ కేటాయించిన ‘‘బై’’ రేటింగ్‌ను కొనసాగిస్తూ షేరు టార్గెట్‌ ధరను రూ.1950 నుంచి రూ.2000లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. డిజిటల్‌ వ్యాపారంలో కంపెనీ వ్యూహాత్మక అడుగులు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌, ఇంటెల్‌, క్వాల్‌కామ్‌లతో ప్రముఖ ప్రైవేట్‌ ఈక్విటీ ప్లేయర్లు జియోలో వాటాను కొనుగోలు చేయడం షేరు ర్యాలీకి మరింత ఉత్సాహానిస్తున్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు