కేజీ-డీ6పై 650 కోట్ల డాలర్ల పెట్టుబడులు

22 Jul, 2013 04:04 IST|Sakshi
కేజీ-డీ6పై 650 కోట్ల డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: గ్యాస్ ఉత్పత్తిలో కేజీ డీ6 బ్లాకునకు పూర్వవైభవాన్ని తీసుకువస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రెసిడెంట్ బి.గంగూలీ ఆశావహంగా పేర్కొన్నారు. ఇందుకు 650 కోట్ల డాలర్ల పెట్టుబడులను వెచ్చించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. వెర సి 2019-20కల్లా తొలి అంచనాల స్థాయిలో 60 ఎంఎంఎస్‌సీఎండీ వరకూ గ్యాస్‌ను ఉత్పత్తి చేయగలమని చెప్పారు. అయితే ఇందుకు సమయానుగుణమైన ప్రభుత్వ అనుమతులతోపాటు, గ్యాస్‌కు సరైన ధర లభించాల్సి ఉన్నదని వ్యాఖ్యానించారు.
 
  ప్రస్తుతం ఈ బ్లాకులో గ్యాస్ ఉత్పత్తి 14 ఎంఎంఎస్‌సీఎండీకు పడిపోయిన సంగతి తెలిసిందే. తూర్పుతీర ప్రాంతంలోని కేజీ డీ6 బ్లాకులో అపార గ్యాస్ నిక్షేపాలు బయటపడినప్పటికీ వాటిని వెలికితీయడంలో కంపెనీ విఫలమవుతూ వస్తోంది. ఇందుకు పలు సాంకేతిక అంశాలు అవరోధంగా నిలుస్తున్నట్లు కంపెనీ చెబుతూ వస్తోంది. 2009 ఏప్రిల్‌లో ఉత్పత్తిని ప్రారంభించాక తొలి దశలో గరిష్టంగా 69.43 ఎంఎంఎస్‌సీఎండీ గ్యాస్‌ను ఉత్పత్తి చేసింది.
 
  2010 మార్చి తరువాత నుంచి బావుల్లో నీరు, ఇసుక తదితరాలు పెల్లుబికుతూ గ్యాస్ ఉత్పత్తికి అవరోధాన్ని కల్పిస్తున్నట్లు కంపెనీ వివరిస్తూ వచ్చింది. ఫలితంగా గ్యాస్ ఉత్పత్తి క్షీణిస్తూ వచ్చింది. కాగా, ఉత్పత్తిని మళ్లీ గరిష్ట స్థాయికి తీసుకువెళ్లే బాటలో పెట్టుబడులు పెట్టేందుకు కట్టుబడి ఉన్నామని తాజాగా గంగూలీ స్పష్టం చేశారు. అయితే గ్యాస్‌కు ఒక ఎంబీటీయూకి కనీసం 7.5 డాలర్ల ధరను చెల్లించకపోతే గ్యాస్ భూమిలోనే ఉండిపోతుందంటూ వ్యాఖ్యానించారు.
 
మరిన్ని వార్తలు