ఆ డిమాండ్‌ వెనక్కి తీసుకుంటాం

19 Jun, 2020 09:07 IST|Sakshi

పీఎస్‌యూలకు ఏజీఆర్‌ నోటీసులపై కేంద్రం

న్యూఢిల్లీ: ఏజీఆర్‌ బాకీల విషయంలో టెలికంయేతర ప్రభుత్వ రంగ సంస్థలకు ఊరట లభించనుంది. దాదాపు రూ. 4 లక్షల కోట్లు కట్టాలంటూ ఇచ్చిన నోటీసులో 96% మొత్తానికి డిమాండ్‌ను ఉపసంహరించుకుంటామంటూ సుప్రీం కోర్టుకు కేంద్ర టెలికం శాఖ (డాట్‌) తెలియజేసింది.  లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం ఫీజుల లెక్కింపునకు టెలికం కంపెనీల సవరించిన ఆదాయాలను (ఏజీఆర్‌) పరిగణనలోకి తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు గతేడాది అక్టోబర్‌లో ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే టెలికం సంస్థలతో పాటు స్పెక్ట్రం తీసుకున్న గెయిల్, పవర్‌గ్రిడ్, ఆయిల్‌ ఇండియా వంటి పీఎస్‌యూలకు రూ. 4 లక్షల కోట్ల మేర బాకీలు కట్టాలని డాట్‌ నోటీసులు పంపింది. తమ ప్రధాన వ్యాపారం టెలికం కార్యకలాపాలు కావు కాబట్టి తమకు ఇది వర్తించదంటూ నోటీసులను సవాలు చేస్తూ అవి సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు, ఏజీఆర్‌ బాకీల విషయంలో భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ తదితర ప్రైవేట్‌ టెల్కోలు దాఖలు చేసిన అఫిడవిట్లకు కౌంటరు దాఖలు చేసేందుకు మరికాస్త సమయం ఇవ్వాలంటూ సుప్రీంను డాట్‌ కోరింది. టెల్కోలు తమ ఆర్థిక వివరాలను సమర్పించాలని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను జూలై మూడో వారానికి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు