50 వేల చ.మీ. ప్రాజెక్ట్‌లకు ఈసీ అక్కర్లేదు!

17 Nov, 2018 01:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశీయ నిర్మాణ రంగానికి కాసింత ఉపశమనం లభించింది. 20 వేల చ.మీ. నుంచి 50 వేల చ.మీ. బిల్టప్‌ ఏరియాలో నిర్మించే నివాస ప్రాజెక్ట్‌ లకు ఎన్విరాన్‌మెంటల్‌ క్లియరెన్స్‌ (ఈసీ) మున్సిపల్‌ శాఖలోనే తీసుకునే వీలుంది. 20 వేల చ.మీ. నుంచి 1.50 లక్షల చ.మీ. బిల్టప్‌ ఏరియాలో నిర్మించే పారిశ్రామిక షెడ్లు, ఆసుపత్రులు, హోటల్స్‌ వంటి వాణిజ్య ప్రాజెక్ట్‌లకైతే (కేటగిరీ–బీ) కూడా స్థానికంగానే తీసుకునేలా కేంద్రం నిబంధనలను సడలించింది.

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో (యూటీ)ల్లోని భవన నిర్మాణ నిబంధనల్లోనే ఇంటిగ్రేట్‌ చేస్తారు. దీంతో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మున్సిపాలిటీలు, పంచాయతీలు, డీటీసీపీ పరిధిలోనే పర్యావరణ అనుమతులు మంజూరవుతాయి. ఆయా ప్రాజెక్ట్‌లల్లో సహజ మురుగు నీటి వ్యవస్థ, నీటి సంరక్షణ, రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్, పునరుత్పాదక విద్యుత్, వ్యర్థాల నిర్వహణ వంటివి నిర్వహించాల్సి ఉంటుంది.


గడువులోగా పూర్తవుతాయ్‌..
స్థానికంగానే ఈసీ అనుమతులు మంజూరు చేస్తే ప్రాజెక్ట్‌లు గడువులోగా పూర్తవ్యటమే కాకుండా వడ్డీల భారం తగ్గుతుందని కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో అందుబాటు గృహాల ప్రాజెక్ట్‌లను చేసేందుకు డెవలపర్లు ముందుకొచ్చే అవకాశముంటుందని క్రెడాయ్‌ జాతీయ అధ్యక్షుడు జక్సే షా తెలిపారు.  

మరిన్ని వార్తలు