క్విడ్ 1,000 సీసీ ఈ ఏడాదే..

20 Feb, 2016 00:26 IST|Sakshi
క్విడ్ 1,000 సీసీ ఈ ఏడాదే..

మార్చిలో మార్కెట్లోకి కొత్త డస్టర్
2016లో లక్ష యూనిట్లు దాటేస్తాం
రెనో ఇండియా సీఈవో సుమిత్

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ రెనో (రెనాల్ట్) ఇండియాకు క్విడ్ మోడల్ బాగా కలిసొచ్చింది. ఇదే ఊపుతో ఇప్పుడు క్విడ్ సిరీస్‌లో 1,000 సీసీతోపాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో మోడళ్లను రూపొందిస్తోంది. ఈ ఏడాదే వీటిని భారత్‌లో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న క్విడ్ కారు 800 సీసీ సామర్థ్యం గలది. గతేడాది సెప్టెంబరు నుంచి క్విడ్ అందుబాటులోకి వచ్చింది. కంపెనీ ఇప్పటిదాకా 32,000 పైచిలుకు క్విడ్ కార్లను విక్రయించింది. మరో లక్ష కార్లకు బుకింగ్స్ నమోదయ్యాయని రెనో ఇండియా సీఈవో సుమిత్ సాహ్నీ శుక్రవారం తెలిపారు. రెనో బేగంపేట్ షోరూంను ప్రారంభించిన సందర్భంగా రీజినల్ బిజినెస్ హెడ్ షహల్ ఎం షంషుద్దీన్, ఆటోలాజిక్ మోటార్స్ ఎండీ జగదీష్ రామడుగుతో కలిసి మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల నుంచి క్విడ్ కార్లను ఎగుమతి చేస్తామని చెప్పారు. 32 రకాల మార్పులతో కొత్త డస్టర్ కారును మార్చిలో విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో 10 రకాల వేరియంట్లు రానున్నాయన్నారు.

 మూడంకెల వృద్ధి..
 రెనో 2015లో దేశంలో అన్ని మోడళ్లు కలిపి 54,000 యూనిట్లు విక్రయించింది. పరిశ్రమ 8.5 శాతం వృద్ధి చెందితే తమ కంపెనీ 20% వృద్ధి నమోదు చేసిందని సుమిత్ వెల్లడించారు. ‘2016లో 100 శాతం వృద్ధితో లక్షకుపైగా యూనిట్లను విక్రయిస్తాం. ప్రస్తుతం భారత కార్ల మార్కెట్లో రెనోకు 3.5-4% వాటా ఉంది. 2017 చివరినాటికి 5%కి చేర్చాలనేది మా లక్ష్యం. కానీ దీన్ని ఈ ఏడాదే చేరుకుంటాం. ప్రస్తుతం మా ర్యాంకు మెరుగుపడి 8 నుంచి 7కు వచ్చాం’ అని తెలిపారు. డాలరు బలపడడం, అధిక ముడి పదార్థాల ధర కారణంగా వాహనాల ధర పెరిగే అవకాశం ఉందని సుమిత్ చెప్పారు. అన్ని కంపెనీలు బడ్జెట్ కోసం ఎదురు చూస్తున్నాయన్నారు. దేశీయంగా అమ్మకాలను పెంచేందుకు పాత వాహనాలను తుక్కుగా మార్చే పథకంతోపాటు రాయితీలు ప్రకటించాలని కోరారు. క్విడ్‌లో 98% విడిభాగాలు దేశీయంగా తయారైనవేనని గుర్తు చేశారు. కంపెనీ అమ్మకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 6%.

>
మరిన్ని వార్తలు