1000 సీసీ సామర్థ్యంతో రెనో క్విడ్..

23 Aug, 2016 00:42 IST|Sakshi
1000 సీసీ సామర్థ్యంతో రెనో క్విడ్..

ధరలు రూ.3.82-3.95 లక్షల రేంజ్‌లో  
మైలేజీ 23 కిమీ.

 న్యూఢిల్లీ: రెనో ఇండియా కంపెనీ చిన్న కారు క్విడ్ మోడల్‌లో కొత్త వేరియంట్లను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ 1.0 లీటర్ క్విడ్ మోడల్‌లో రెండు వేరియంట్లను-ఆర్‌ఎక్స్‌టీ, ఆర్‌ఎక్స్‌టీ(ఓ) పేరిట అందిస్తున్నామని కంపెనీ తెలిపింది. ఆర్‌ఎక్స్‌టీ ధర రూ.3.82 లక్షలు, ఆర్‌ఎక్స్‌టీ(ఓ)ధర రూ.3.95 లక్షలని (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) తెలియజేసింది. మంచి పనితీరు కనబరిచేలా ఈ కొత్త వేరియంట్లను తీర్చిదిద్దామని కంపెనీ సీఈఓ, ఎండీ సుమిత్ సాహ్ని తెలిపారు. డోర్ల మీద స్పోర్ట్స్ డిజైనర్ గ్రాఫిక్స్, ప్రొ-సెన్స్ సీట్ బెల్ట్, ప్రి-టెన్షనర్ష్ విత్ లోడ్ లిమిటర్స్, 300 లీటర్ల బూట్ స్పేస్ తదితర ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. ఆర్‌ఎక్స్‌టీ(ఓ) వేరయంట్‌లో పవర్ విండోలు, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ విత్ నావిగేషన్, యూఎస్‌బీ, ఏయూఎక్స్ సపోర్ట్, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్(ఆప్షనల్) తదితర ప్రత్యేకతలున్నాయని వివరించారు.

 మైలేజీ 23 కిలోమీటర్లు ఇస్తుందని ఏఆర్‌ఏఐ (ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ధ్రువీకరించినట్లు తెలిపారు. మారుతీ సుజుకి ఆల్టో కే10, హ్యుందాయ్ ఇయాన్, టాటా టియాగోలకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

 ఏడాదికొక కొత్త మోడల్...
ప్రస్తుతం రెనో కంపెనీ 800 సీసీ ఇంజిన్ కెపాసిటితో క్విడ్ కారును రూ.2.64 లక్షలు నుంచి రూ.3.73 లక్షల రేంజ్‌లో విక్రయిస్తోంది. కాగా ప్రధాన పోటీ కారు అయిన ఆల్టో కె10 కార్ల ధరలు రూ.3.25 లక్షల నుంచి రూ.3.82 లక్షల రేంజ్‌లో  ఉన్నాయి. ఈ కొత్త వేరియంట్లతో మరింత మంది వినియోగదారులకు చేరువ కానున్నామని సుమిత్ సాహ్ని అశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్ల ఉత్పత్తిని  మరింతగా పెంచామని, దీంతో ఈ కారు వెయిటింగ్ పీరియడ్ 2-3 నెలల కాలం నుంచి 1-2 నెలల కాలానికి తగ్గుతుందని తెలిపారు. ప్రస్తుతం నెలకు పదివేల క్విడ్‌కార్లను తయారు చేస్తున్నామని, కొత్త వేరియంట్లు కూడా వచ్చాక, డిమాండ్‌ను బట్టి ఉత్పత్తిని మరింత పెంచుతామని వెల్లడించారు.

 ఆటో గేర్ స్విఫ్ట్ ట్రాన్సిమిషన్ మోడల్‌ను కూడా తేవాలనుకుంటున్నామని తెలిపారు. రానున్న కొన్నేళ్లలో ఏడాదికొక కొత్త మోడల్‌ను భారత మార్కెట్లోకి తెస్తామని చెప్పారాయన. గత ఏడాదిలో మార్కెట్లోకి క్విడ్‌ను తెచ్చామని, ఇప్పటికే 1.65 లక్షల కార్లను విక్రయించామని, క్విడ్ కారు మంచి విజయాన్ని సాధించిందని వివరించారు. ఈ ఏడాది చివరికల్లా 5 శాతం మార్కెట్ వాటా సాధించడం లక్ష్యమని పేర్కొన్నారు. డీలర్ల నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తున్నామని సాహ్ని తెలిపారు.

మరిన్ని వార్తలు