నిస్సాన్‌ + రెనో = ....?

30 Mar, 2018 01:40 IST|Sakshi

ఇరు కంపెనీల మధ్య విలీన చర్చలు!!

ఆటోమొబైల్‌ పరిశ్రమలో మరో పెద్ద డీల్‌కు తెరలేవబోతోంది. ఒకటేమో ఫ్రెంచ్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ రెనో. మరొకటేమో జపాన్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ నిస్సాన్‌. పైపెచ్చు రెండింటికీ ఒకదానిలో మరొక దానికి వాటాలు కూడా ఉన్నాయి. తాజాగా ఇవి రెండూ పరస్పరం విలీనానికి చర్చలు మొదలెట్టాయి.

ఈ రెండూ కలిసి కొత్త సంస్థ ఏర్పాటవుతుందని విలీన అంశంతో సంబంధమున్న వర్గాలు తెలియజేశాయి. విలీన డీల్‌తో రెండు కంపెనీల మధ్య ప్రస్తుతమున్న భాగస్వామ్యం పోయి ఓ పెద్ద సంస్థ ఆవిర్భవిస్తుంది. రెనోకు ప్రస్తుతం నిస్సాన్‌లో 43 శాతం వాటా ఉంది. అలాగే నిస్సాన్‌కు రెనోలో 15 శాతం వాటా ఉంది.

రెనో, నిస్సాన్‌ కంపెనీల చైర్మన్‌ కార్లోస్‌ ఘోసన్‌ ఈ విలీన చర్చలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, విలీనానంతరం ఏర్పాటు కానున్న సంస్థకు కూడా ఈయనే నాయకత్వం వహిస్తారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే రెనో, నిస్సాన్‌ విలీన డీల్‌ పూర్తి కావడం కష్టమేనని ఆ వర్గాలు చెబుతున్నాయి. ‘‘ఫ్రెంచ్‌ ప్రభుత్వానికి రెనోలో 15 శాతం వాటా ఉంది. దీన్ని వదులుకోవడానికి, తన నియంత్రణను కోల్పోవడానికి ప్రభుత్వం ఇష్టపడకపోవచ్చు.

అలాగే కొత్త కంపెనీ ఏర్పాటు ఎక్కడనేది కూడా ప్రధానమైనదే’’ అని ఆ వర్గాలు చెప్పాయి. విలీనం జరిగితే లండన్‌ లేదా నెదర్లాండ్స్‌లో కంపెనీ ఏర్పాటుకు అవకాశాలున్నట్లు తెలిసింది. అయితే కంపెనీల ప్రతినిధులు కానీ, ఫ్రెంచ్‌ ఆర్థిక మంత్రిత్వ శాఖ కానీ విలీన వార్తలపై స్పందించలేదు. ఇక రెనో మార్కెట్‌ క్యాప్‌ 33 బిలియన్‌ డాలర్లుగా, నిస్సాన్‌ మార్కెట్‌ క్యాప్‌ 43 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

మరిన్ని వార్తలు