మార్కెట్లోకి ‘రెనో ట్రైబర్‌’

29 Aug, 2019 10:46 IST|Sakshi

ధర రూ. 4.95 లక్షలు – 6.49 లక్షలు

ముంబై: ప్రముఖ వాహన తయారీ కంపెనీ రెనో.. భారత మార్కెట్లోకి తన ‘ట్రైబర్‌’ కారును బుధవారం ప్రవేశపెట్టింది. ఈ కాంపాక్ట్‌ సెవన్‌ – సీటర్‌ మల్టీ పర్పస్‌ వెహికిల్‌ ధరల శ్రేణి రూ. 4.95 లక్షలు నుంచి రూ. 6.49 లక్షలుగా ప్రకటించింది. పొడవు 4 మీటర్ల కన్నా తక్కువ ఉన్న ఈ అధునాతన కారులో 1.0–లీటర్‌ 3–సిలెండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చింది. మొత్తం నాలుగు ఎయిర్‌ బ్యాగ్‌లు ఉన్నట్లు కంపెనీ వివరించింది. ఈ సందర్భంగా రెనో ఇండియా ఆపరేషన్స్‌ కంట్రీ సీఈఓ, ఎండీ వెంకట్రామ్‌ మామిళ్లపల్లి మాట్లాడుతూ.. ‘భారత మార్కెట్‌ కోసమే ప్రత్యేకంగా కార్లను అభివృద్ధి చేస్తున్నాం. ఇక్కడి మార్కెట్లో ఏడాదికి ఒక నూతన కారును ప్రవేశపెట్టనున్నాం. 2022 వరకు వీటి విడుదల ఉండేలా నిర్ణయించాం. గ్రామీణ  విక్రయాలను 2022 నాటికి రెట్టింపు చేయాలని లక్ష్యంగా నిర్దేశించాం’ అని వ్యాఖ్యానించారు. 

భారత మార్కెట్లోకి రెనో ఎలక్ట్రిక్‌ కారు..!
ప్రణాళిక ప్రకారం తమ కంపెనీ ఎలక్ట్రిక్‌ వాహన(ఈవీ) మార్కెట్లోకి ప్రవేశించనున్నట్లు వెంకట్రామ్‌ మామిళ్లపల్లి ప్రకటించారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని.. నాణ్యత లేని ఈవీని విడుదలచేసి, వాటిని గ్యారేజీలకు పరిమితం చేయడం కంటే, సమయం తీసుకుని అయినా పటిష్టమైన వాహనాన్ని విడుదలచేస్తామన్నారు. 2022 నాటికి రెనో ఈవీ మార్కెట్లోకి వస్తుందని ప్రకటించారు.

>
మరిన్ని వార్తలు