ఫ్లోటింగ్‌ రేట్‌ రుణాలకు రెపోనే ప్రాతిపదిక

24 Sep, 2019 08:50 IST|Sakshi

ఎస్‌బీఐ ప్రకటన అక్టోబర్‌ 1 నుంచీ అమలు  

ముంబై: తమ చర వడ్డీ (ప్లోటింగ్‌) రుణాలు అన్నింటికీ రెపో రేటే ప్రామాణికంగా ఉంటుందని ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ప్రకటించింది. అక్టోబర్‌ 1వ తేదీ నుంచీ ఈ నిర్ణయం అమలవుతుందని స్పష్టం చేసింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  (ఆర్‌బీఐ) వసూలు చేసే వడ్డీరేటే రెపో. ప్రస్తుతం ఇది 5.4 శాతంగా ఉంది.  

ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా...
బ్యాంకింగ్‌ రుణ రేట్లు అన్నీ రెపోసహా ద్రవ్య విధాన నిర్ణయ రేట్లకు, ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేట్లకు అనుసంధానం కావాల్సిందేనని బ్యాంకులకు ఈ నెలారంభంలో ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలలకు ఒకసారి  ఇందుకు సంబంధించి సమీక్షలు, అనుసంధాన నిర్ణయాలు (రిసెట్‌) జరగాలని ఆర్‌బీఐ నిర్దేశించింది. వ్యక్తిగత లేదా గృహ, ఆటో అలాగే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) ఇచ్చే కొత్త ఫ్లోటింగ్‌ (చర వడ్డీరేటు) రేట్లు ఈ ఏడాది అక్టోబర్‌ 1వ తేదీ నుంచీ తప్పనిసరిగా రెపో సహా ద్రవ్య, పరపతి విధాన నిర్ణయ రేట్లకు, ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేట్లకు తప్పనిసరిగా అనుసంధానం చేయాల్సి ఉంటుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. దీనివల్ల ఆర్‌బీఐ రెపో తగ్గిస్తే, ఆ ప్రయోజనం త్వరితగతిన కస్టమర్‌కు అందుబాటులోనికి రావడానికి వీలు కలుగుతుంది.  బ్యాంకులు తమకు లభించిన రెపో రేటు ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయిండచం లేదని, ఆర్థిక మందగమనానికి ఇది ఒక కారణమనీ వస్తున్న విమర్శల నేపథ్యంలో ఆర్‌బీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా బ్యాంకింగ్‌ చర్యలు తీసుకుంటోంది. 

ప్రస్తుత పరిస్థితిపై నిరుత్సాహం...
ప్రస్తుతం నిధుల సమీకరణ–వ్యయ మిగులు ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) విధానాన్ని బ్యాంకులు అనుసరిస్తున్నాయి. అయితే  వివిధ కారణాల వల్ల ఆర్‌బీఐ విధానపరమైన రేటు నిర్ణయ బదలాయింపు ప్రక్రియ ఎంసీఎల్‌ఆర్‌ మార్గంలో ఆలస్యం అవుతోంది. రెపో గడచిన నాలుగు ద్వైమాసికాల్లో 1.1 శాతం తగ్గింది.  అయితే ఆగస్టు వరకూ రెపో 0.75 బేసిస్‌ పాయింట్లు తగ్గితే, (అటు తర్వాత 35 బేసిస్‌ పాయింట్లు) బ్యాంకులు మాత్రం 0.30 శాతం మాత్రమే ఈ రేటును కస్టమర్లకు బదలాయించాయని ఆర్‌బీఐ స్వయంగా పేర్కొంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా