కీలక పాలసీ వడ్డీరేట్లు యథాతథం..

4 Jun, 2014 09:59 IST|Sakshi
కీలక పాలసీ వడ్డీరేట్లు యథాతథం..

ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మరోసారి రేట్ల తగ్గింపు ఆశలపై నీళ్లుచల్లారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మందగమనం కొనసాగుతున్నా.. ద్రవ్యోల్బణం కట్టడికే ప్రాధాన్యమిచ్చారు. కీలక పాలసీ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని మంగళవారం జరిగిన పరపతి విధాన సమీక్షలో ఆర్‌బీఐ నిర్ణయించింది. అయితే, చట్టబద్ద ద్రవ్య నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్)ను మాత్రం అర శాతం తగ్గించడంద్వారా వ్యవస్థలోకి ద్రవ్యసరఫరా పెంచే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా ద్రవ్యోల్బణం గనుక మరింత తగ్గుముఖం పడితే వడ్డీరేట్లను తప్పకుండా తగ్గిస్తామని చెప్పడం ఒక్కటే కాస్తలోకాస్త ఊరటనిచ్చే విషయం. అయితే, ఎస్‌ఎల్‌ఆర్‌ను తగ్గించినప్పటికీ... తాము ఇప్పట్లో వడ్డీరేట్లను తగ్గించే అవకాశం లేదని బ్యాంకర్లు తేల్చిచెప్పారు.
 
 ముంబై: మోడీ నేతృత్వంలోని కొత్త సర్కారు కొలువైన తర్వాత తొలిసారిగా చేపట్టిన ఆర్‌బీఐ పాలసీ సమీక్షలో దాదాపు అందరి అంచనాలకు అనుగుణంగానే నిర్ణయం వెలువడింది. కీలక పాలసీ రేట్లను మార్చకుండా వదిలేసినప్పటికీ.. ఎస్‌ఎల్‌ఆర్‌ను అర శాతం ఆర్‌బీఐ తగ్గించింది. దీంతో ప్రస్తుతం 23 శాతంగా ఉన్న ఎస్‌ఎల్‌ఆర్ 22.5 శాతానికి తగ్గింది. ఈ నెల 14 నుంచి ఈ తగ్గింపు నిర్ణయం అమలవుతుందని పేర్కొంది.

తాజా చర్యలతో వ్యవస్థలోకి సుమారు రూ.40,000 కోట్లు విడుదలయ్యే అవకాశం ఉంది. దీనివల్ల బ్యాంకులకు రుణాలిచ్చేందుకు నిధుల లభ్యత పెరగనుంది. ఇదిలాఉండగా... రెపో రేటు 8 శాతం, రివర్స్ రెపో రేటు 7 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్) 4 శాతం చొప్పున ఇప్పుడున్న స్థాయిలోనే కొనసాగనున్నాయి. బ్యాంక్ రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ(ఎంఎస్‌ఎఫ్)లను కూడా ప్రస్తుత 9 శాతం వద్దే ఉంచుతున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.

 వరుసగా రెండోసారీ నో చేంజ్...
 ఆర్‌బీఐ గవర్నర్‌గా గతేడాది సెప్టెంబర్‌లో బాధ్యతలు చేపట్టిన రాజన్.. ఆతర్వాత మూడుసార్లు పావు శాతం చొప్పున రెపో రేటును పెంచడం తెలిసిందే. అయితే, తాజాగా రేట్లను యథాతథంగా ఉంచడంద్వారా వరుసగా రెండోసారి పాలసీ రేట్లను పెంచడం లేదా తగ్గించకుండా వదిలేసినట్లయింది. ప్రధానంగా ద్రవ్యోల్బణం కట్టడికే తమ తొలిప్రాధాన్యమంటూ వస్తున్న రాజన్.. తాజాగా మోడీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూడా ఇదే పల్లవిని వినిపించారు. గతేడాది జీడీపీ వృద్ధి రేటు ఇంకా మందగమనంలోనే 4.7 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. కాగా, సరఫరాపరమైన అడ్డంకుల నేపథ్యంలో ఆర్‌బీఐ లక్ష్యానికి అనుగుణంగా ద్రవ్యోల్బణం దిగొచ్చే అవకాశాలు లేవని విశ్లేషకులు అంటున్నారు. దీనివల్ల డిసెంబర్‌లోపు మరో విడత పాలసీ రేట్ల పెంపు తప్పకపోవచ్చని బ్రోకరేజి దిగ్గజం క్రెడిట్ సూసే అభిప్రాయపడింది.

 పాలసీలో ఇతర ముఖ్యాంశాలు...
 ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు గతంలో అంచనావేసినట్లుగానే 5.5 శాతంగా ఉండొచ్చు.

  ఫారెక్స్ మార్కెట్లో సానుకూల పరిస్థితుల నేపథ్యంలో(డాలరుతో రూపాయి విలువ బలపడటం) వ్యక్తిగతంగా విదేశాల్లో పెట్టే వార్షిక పెట్టుబడుల పరిమితి పెంపు. ప్రస్తుత 75,000 డాలర్ల స్థాయి నుంచి 1.25 లక్షల డాలర్లకు పెంచుతూ నిర్ణయం.
  బంగ్లాదేశ్, పాకిస్థాన్ పౌరులు మినహా భారత, విదేశీ పౌరులు భారత్ నుంచి బయటికి వెళ్లినప్పుడు ఇకపై రూ.25,000 వరకూ భారతీయ కరెన్సీని పట్టుకెళ్లేందుకు అనుమతి. ప్రస్తుతం విదేశాలకు వెళ్లే భారతీయులు రూ.10,000 వరకూ మాత్రమే దేశీ కరెన్సీని తమతో తీసుకెళ్లేలా ఆర్‌బీఐ పరిమితి ఉంది.

  ఫారెక్స్ మార్కెట్‌లో దేశీయ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ కరెన్సీ డెరివేటివ్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు కూడా లావాదేవీలు జరిపేం దుకు అనుమతి. ఈ విభాగంలో ట్రేడింగ్ పరిమాణం తగ్గడంతో దీన్ని బలోపేతం చేసేందుకు చర్యలు.

  ఎక్స్‌పోర్ట్ క్రెడిట్ రీఫైనాన్స్ సదుపాయం కింద నిధుల లభ్యత తగ్గింపు. ప్రస్తుతం ఎగుమతిదారులు తాము చెల్లించాల్సిన రుణ మొత్తంలో మరో 50 శాతం వరకూ రుణం తీసుకోవడానికి వీలుండగా.. దీన్ని ఇప్పుడు 32 శాతానికి తగ్గిస్తూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.
 
 
 వడ్డీ రేట్లను తగ్గించలేం తేల్చిచెప్పిన బ్యాంకర్లు
 ఆర్‌బీఐ ఎస్‌ఎల్‌ఆర్‌ను అర శాతం తగ్గించినప్పటికీ.. తాము మాత్రం వడ్డీరేట్ల తగ్గించే అస్కారం లేదని బ్యాంకర్లు స్పష్టం చేశారు. పాలసీ సమీక్ష తమ అంచనాలకు అనుగుణంగానే ఉందన్నారు.

ఆర్‌బీఐ పాలసీపై ఎవరేమన్నారంటే...
 ఆర్‌బీఐ నిర్దేశించిన స్థాయికంటే ప్రస్తుతం బ్యాంకుల ఎస్‌ఎల్‌ఆర్ స్థాయి అధికంగానే ఉంది. దీన్ని తగ్గించడంవల్ల తక్షణం ఎలాంటి ప్రభావం ఉండదు. ద్రవ్యసరఫరా పెంపు సంకేతమిది. సమీప కాలంలో వడ్డీరేట్లు తగ్గే అవకాశాల్లేవు. - అరుంధతీ భట్టాచార్య, ఎస్‌బీఐ చైర్మన్
 
 కొత్త ప్రభుత్వం రానున్న నెలల్లో వృద్ధి పెంపునకు, ద్రవ్యోల్బణం కట్టడి కోసం తీసుకోబోయే పాలసీ విధానపరమైన చర్యలను పరిశీలించి తదనుగుణంగా తగిన నిర్ణయం తీసుకోవడానికివీలుగానే ఆర్‌బీఐ పరపతి విధాన నిర్ణయం ఉంది. కేంద్రంలో కొలువుదీరిన మోడీ సర్కారు వృద్ధికి చేయూతనిస్తుందన్న అంచనాల నేపథ్యంలో వేచిచూసే ధోరణితో ఆర్‌బీఐ వ్యవహరించింది. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ
 
 ఎస్‌ఎల్‌ఆర్ తగ్గింపు వల్ల మాకు రూ.1,600 కోట్ల నిధుల లభ్యత పెరిగినప్పటికీ వడ్డీరేట్లలో మార్పులను మేం పరిశీలించే అవకాశం లేదు.
 - ఎం.నరేంద్ర, ఐఓబీ సీఎండీ
 
 ఎస్‌ఎల్‌ఆర్ కోతను స్వాగతించిన కార్పొరేట్లు
 పాలసీ వడ్డీరేట్లను తగ్గించనప్పటికీ.. ఎస్‌ఎల్‌ఆర్‌ను అర శాతం తగ్గించడంపట్ల పారిశ్రామిక వర్గాలు హర్హం వ్యక్తం చేశాయి. ఈ చర్యతో కార్పొరేట్ రంగానికి రుణాలు పెంచేందుకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని చాంబర్లు పేర్కొన్నాయి. సరళ పాలసీని అనుసరించడం ద్వారా పెట్టుబడులను పెంచేందుకు ఆర్‌బీఐ తీసుకున్న చర్యలను ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్దార్థ్ బిర్లా ప్రశంసించారు. కాగా, ఎస్‌ఎల్‌ఆర్ తగ్గింపు వల్ల పారిశ్రామిక రంగానికి పెట్టుబడులకు రుణ లభ్యత పెరిగి, వృద్ధికి కూడా ఊతమిస్తుందని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. కాగా, అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ మాత్రం నిధుల లభ్యత పెరగడం కంటే వడ్డీరేట్ల తగ్గింపే ప్రస్తుతం పారిశ్రామిక రంగానికి అత్యవసరమని చెప్పారు.

 రియల్టర్ల అసంతృప్తి: పాలసీ రేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంపట్ల రియల్ ఎస్టేట్ రంగం అసంతృప్తి వ్యక్తం చేసింది. వృద్ధికి ఊతమిచ్చేవిధంగా మళ్లీ హౌసింగ్ డిమాండ్ పెంచాలంటే ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించాలని రియల్టీ డెవలపర్ల సంఘాల సమాఖ్య(క్రెడాయ్) డిమాండ్ చేసింది. ‘వ్యవస్థలోకి ద్రవ్యసరఫరా పెంచేలా ఎస్‌ఎల్‌ఆర్‌ను తగ్గించడాన్ని మేం స్వాగతిస్తున్నాం. అయితే, వడ్డీరేట్ల తగ్గింపు ద్వారా ఇళ్ల కొనుగోళ్లు పెంచే చర్యల కోసం రియల్టీ పరిశ్రమల వేచిచూస్తోంది’ అని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ సి.శేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీర్ఘకాలం పాటు వడ్డీరేట్లు తగ్గకుండా అక్కడే ఉంటే ఇళ్ల కొనుగోళ్లు జోరందుకోవడం కష్టమని క్రెడాయ్ చైర్మన్ లలిత్ జైన్ పేర్కొన్నారు.
 
 ఆర్‌బీఐ అస్త్రాలు...
 నగదు నిల్వల నిష్పతి(సీఆర్‌ఆర్): బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో కచ్చితంగా ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన మొత్తమే సీఆర్‌ఆర్.
 రెపో రేటు: బ్యాంకులు తన వద్దనుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీని రెపో రేటుగా పేర్కొంటారు.
 రివర్స్ రెపో: బ్యాంకులు తన వద్ద ఉంచే అదనపు నిధులపై రిజర్వ్ బ్యాంక్ చెల్లించే వడ్డీనే రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు.
 ఎస్‌ఎల్‌ఆర్: బ్యాంకులు తమ వద్దనున్న డిపాజిట్లలో కొంత మొత్తాన్ని తప్పనిసరిగా ప్రభుత్వ సెక్యూరిటీ(బాండ్‌లు)ల్లో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. దీన్నే చట్టబద్ధ ద్రవ్య నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్)గా వ్యవహరిస్తారు. రుణ వృద్ధిని నియంత్రించేందుకు ఆర్‌బీఐ దీన్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది.

మరిన్ని వార్తలు