ఈ ఏడాది 20 వేల నియామకాలు

3 Jun, 2017 01:04 IST|Sakshi
ఈ ఏడాది 20 వేల నియామకాలు

ఉద్యోగాల కోత అంశాన్ని ఎక్కువ చేసి చూపారు
ఇన్ఫోసిస్‌ సీవోవో యూబీ ప్రవీణ్‌ రావు


న్యూఢిల్లీ: దేశీ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ‘ఇన్ఫోసిస్‌’ తాజాగా ఈ ఏడాది 20,000 నియామకాలను చేపడతామని ప్రకటించింది. పనితీరు మదింపు అధారంగా కేవలం 400 మందిని మాత్రమే ఇంటికి వెళ్లాలని కోరామని పేర్కొంది. ఉద్యోగాల కోత భారీ స్థాయిలో ఉందని వచ్చిన వార్తలను కంపెనీ కొట్టిపారేసింది. ఉద్యోగుల తొలగింపు అంశాన్ని ఎక్కువ చేసి చూపారని మండిపడింది. టెక్నాలజీ ఆధారిత పరివర్తన క్రమంలో పలు కొత్త అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఇన్ఫోసిస్‌ సీవోవో యూబీ ప్రవీణ్‌ రావు తెలిపారు. ‘పనితీరు మదింపు ప్రక్రియ ప్రతి సంవత్సరం ఉంటుంది. దీని ఆధారంగానే తొలగింపులు ఉంటాయి.

వీటి సంఖ్య కేవలం 300–400 స్థాయిలో ఉంది. ప్రస్తుత తొలగింపులు ఎప్పటిలాగే స్థిరంగానే ఉన్నాయి’ అని వివరించారు. గతేడాది 20,000కుపైగా మందిని నియమించుకున్నామని, ఇదే సంఖ్యను భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామని తెలిపారు. ఈయన సంస్థ కో–చైర్మన్‌ రవి వెంకటేశన్‌ తో కలిసి శుక్రవారం ఐటీ మంత్రి రవి శంకర ప్రసాద్‌తో అరగంటపాటు సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ప్రవీణ్‌ రావు మీడియాతో మాట్లాడారు. ‘ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తాం. అధిక ఉద్యోగాలను సృష్టిస్తాం. కేవలం అతితక్కువ సంఖ్యలోనే ఉద్యోగుల తొలగింపు జరుగుతోంది. అది కూడా పనితీరు ప్రాతిపదికన’ అని పేర్కొన్నారు.

కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్స్‌ వారి వేతనాలు కొద్దిమేర తగ్గించుకోవడం, ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు నేర్పించడం వంటి అంశాలపై దృష్టిపెట్టడం ద్వారా ఉద్యోగాల కోతను అడ్డుకోవచ్చని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై ఈయన స్పందించలేదు. టీసీఎస్, ఇన్ఫోసిస్‌ వంటి ఐటీ కంపెనీలు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంటున్నాయని ప్రసాద్‌ పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు