ఏప్రిల్‌ 1 నుంచి  రెరా జరిమానా 4 లక్షలు

16 Mar, 2019 00:56 IST|Sakshi

మొండికేస్తే ప్రాజెక్ట్‌ వ్యయంలో 10 శాతం ఫైన్‌ 

రూ.2 లక్షల పెనాల్టీతో ఈ నెలాఖరు వరకూ నమోదుకు అవకాశం 

‘సాక్షి రియల్టీ’తో తెలంగాణ రెరా సెక్రటరీ కె. విద్యాధర్‌  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా) ఏప్రిల్‌ 1 నుంచి జరిమానా మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచేందుకు సిద్ధమైంది. అయినా నమోదు చేసుకోని మొండి ఘటాలపై సెక్షన్‌ 59 కింద ప్రాజెక్ట్‌ వ్యయంలో 10 శాతం పెనాల్టీ వి«ధించనుంది. రూ.2 లక్షల ఫైన్‌తో ఈనెల 31 వరకూ రెరా నమోదు గడువుకు మరొక అవకాశమిస్తున్నామని టీ–రెరా సెక్రటరీ కె. విద్యాధర్‌ ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. 

2016లో కేంద్రం రెరా చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఏడాది ఆలస్యంగా 2017లో రెరాను నోటిఫై చేసింది. జనవరి 1, 2017 నుంచి ఆగస్టు 31, 2018 మధ్య జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీఎస్‌ఐఐసీ, మున్సిపాలిటీ, పంచాయతీల నుంచి అనుమతి పొందిన ప్రతి ప్రాజెక్ట్‌ రెరాలో నమోదు చేసుకోవాలని తెలిపింది. 

రెరాలో 4176 రిజిస్ట్రేషన్స్‌.. 
ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. జనవరి 1, 2017 తర్వాత ఆయా ప్రభుత్వ విభాగాల నుంచి సుమారు 5 వేల ప్రాజెక్ట్‌లు అనుమతి పొందాయి. ఇందులో 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్ల కంటే ఎక్కువుండే ప్రతి ప్రాజెక్ట్‌ నమోదు చేసుకోవాల్సిందే. కానీ, ఇప్పటివరకు ప్రాజెక్ట్‌లు, ఏజెంట్లు రెండూ కలిపి 4176 నమోదయ్యాయి. వీటిల్లో 2338 ప్రాజెక్ట్‌లు, 1800లకు పైగా ఏజెంట్లుంటారు. ప్రస్తుతం రోజుకు 20 ప్రాజెక్ట్‌లు నమోదు అవుతున్నాయని.. మరొక 700 ప్రాజెక్ట్‌లు నమోదైతే లక్ష్యం నెరవేరినట్లేనని విద్యాధర్‌ తెలిపారు. 

టీ రెరా రూ.3 కోట్లు 
గతేడాది డిసెంబర్‌ నుంచి గడువులోగా నమోదు చేసుకోని ప్రాజెక్ట్‌లపై జరిమానాలను విధించడం ప్రారంభమైంది. తొలుత రూ.50 వేలు, ఆ తర్వాత లక్ష రూపాయలకు పెంచాం. గత నెలన్నర రోజులుగా జరిమానా మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచాం. ఇప్పటివరకు జరిమానాల రూపంలో రూ.3 కోట్లు వసూలయ్యాయని విద్యాధర్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు