త్వరలోనే రూ.20 నోటు, మరి పాతది?

25 Dec, 2018 15:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా  (ఆర్‌బీఐ) మరో కొత్త నోటును చలామణిలోకి తీసుకురానుంది. మహాత్మాగాంధీ కొత్త సిరీస్‌లో  కొత్త  20 రూపాయల నోటును త్వరలోనే చలామణిలోకి తేనుంది. అదనపు భద్రతా ప్రమాణాలతో రూ. 20నోటును చలామణిలోకి తీసుకురానున్నట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. మహాత్మాగాంధీ కొత్త సిరీస్‌ కింద కొత్త  నోట్లను  తీసుకొచ్చినప్పటికీ, రద్దు చేసిన రూ.1000, రూ. 500 నోట్లు మినహా మిగిలిన పాత నోట్లన్నీ చలామణీలోనే ఉంటాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

ఆర్‌బీఐ డేటా ప్రకారం.. 2016, మార్చి 31 నాటికి 492 కోట్ల రూ. 20నోట్లు చలామణీలో ఉన్నాయి. 2018 మార్చి నాటికి ఈ సంఖ్య 1000కోట్లకు చేరినట్లు ఆర్‌బీఐ అంచనా. దేశంలో మొత్తం చలామణిలో ఉన్న కరెన్సీలో 9.8శాతం రూ. 20 కరెన్సీ నోట్లు ఉన్నట్లు రిజర్వ్‌ బ్యాంక్ వెల్లడించింది.

కాగా  2016 నవంబరు 8న  పెద్ద నోట్ల రద్దు (రూ. 1000, రూ. 500) తర్వాత ఆర్‌బీఐ అనేక కొత్త నోట్లను విడుదల చేసింది. రూ. 2000, రూ. 500, రూ. 200, రూ. 100, రూ. 50, రూ. 10 విలువ గల కొత్త కరెన్సీ నోట్లను చలామణిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.  ఇప్పటికే తీసుకొచ్చిన మిగతా కొత్త నోట్ల మాదిరిగానే రూ.20 నోటుకూ పాత నోట్ల కంటే కాస్త చిన్న సైజులో,  డిజైన్‌ కూడా పాతవాటి కంటే భిన్నగా ఉండనుందని  సమాచారం.

మరిన్ని వార్తలు