ఆర్‌బీఐ అసాధారణ నిర్ణయం తీసుకుంటుందా?  

4 Jun, 2019 20:46 IST|Sakshi

కీలక వడ్డీరేటు 0.35శాతం తగ్గింపు?

బుధవారం రంజాన్‌ సందర‍్భంగా దేశీయ స్టాక్‌మార్కెట్లకు సెలవు

గురువారం పాలసీ రివ్యూ

సాక్షి, ముంబై: రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా  అనూహ్య నిర్ణయం తీసుకోనుందా? కీలక వడ్డీరేట్ల పెంపు విషయంలో అసాధారణ అడుగు వేయబోతోందా? తాజా అంచనాలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సారథ్యంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సోమవారం ప్రారంభించింది.  ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగమనం, మార్చి త్రైమాసికంలో 5.8 శాతం వద్ద అయిదేళ్ల కనిష్టానికి పడిపోయిన  నేపథ్యంలో  ఆర్‌బీఐ కీలక వడ్డీరేను ఈ సారి 0.35 శాతం లేదా 35 బేసిస్‌ పాయింట్లనుతగ్గించే అవకాశం ఉందనే అంచనాలు భారీగా నెలకొన్నాయి.  

0.25శాతం రేట్‌ కట్‌ ఉంటుందని ఇప్పటికే చాలామంది విశ్లేషకులు  భావించినప్పటికీ  ఏప్రిల్‌ మాస ద్రవ్యోల్బణం 2.92 శాతానికి చేరిన నేపథ్యంలో ఆర్‌బీఐ 35 బేసిస్‌ పాయింట్ల కోతకు మొగ్గు చూపే అవకాశం ఉందని మరికొందరు విశ్లేషిస్తున్నారు.  ప్రధానంగా  మే నెలలో ద్రవ్యోల్బణం  3.3 శాతానికి పెరగవచ్చని  విదేశీ బ్రోకరేజ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ విశ్లేషకులు పేర్కొన్నారు.  అలాగే గత నెలలో న్యూయార్క్‌లో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తి కాంతదాస్  0.25 శాతం లేదా అంతకంటే ఎక్కువ రేట్‌ కట్‌ ఉండవచ్చన్న ప్రసంగాన్ని సంస్థ గుర్తు చేస్తోంది. కాగా సోమవారం నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు గురువారం వెలువడనున్నాయి. రంజాన్‌ (ఈదుల్‌ ఫితర్‌) పండుగ సందర్భంగా బుధవారం మార్కెట్లకు సెలవు .
 

మరిన్ని వార్తలు