వనరుల సద్వినియోగానికి అత్యాధునిక టెక్నాలజీ

17 Jul, 2015 00:51 IST|Sakshi
వనరుల సద్వినియోగానికి అత్యాధునిక టెక్నాలజీ

ఎస్‌ఈసీఎం సీఈవో చంద్రశేఖర రెడ్డి

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఇంధన వనరుల సద్వినియోగానికి ప్రపంచ దేశాల్లో అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖకు చెందిన స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఎస్‌ఈసీఎం) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ.చంద్రశేఖర రెడ్డి గురువారం తెలిపారు. సీఐఐ నిర్వహిస్తున్న పవర్ ప్లాంట్ సమ్మిట్-2015లో ఆయన మాట్లాడారు. డొమెస్టిక్ ఎఫీషియెంట్ లైటింగ్ ప్రోగ్రాం కింద ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్‌తో (ఈఈఎస్‌ఎల్) కలిసి ఎస్‌ఈసీఎం ఇప్పటికే 55 లక్షల ఎల్‌ఈడీ బల్పులను పంపిణీ చేసిందని చెప్పారు. ‘విశాఖతోసహా ఇతర మున్సిపాలిటీల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశాం.

తద్వారా సంప్రదాయ విధానంతో పోలిస్తే 23 శాతం విద్యుత్ ఆదా అయింది. ఇంధన వనరుల సద్వినియోగాన్ని మరింత మెరుగుపరిచేందుకై ఈఈఎస్‌ఎల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా రూ.1,000 కోట్ల నిధులు కేటాయించాయి’ అని వెల్లడించారు. పర్యావరణ స్థిరత్వం ద్వారానే పోటీలో నిలదొక్కుకోవడమేగాక ప్రపంచ స్థాయికి వెళ్లొచ్చన్న విషయాన్ని భారతీయ పరిశ్రమ గుర్తించిందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) డెరైక్టర్ జనరల్ అజయ్ మాథుర్ తన లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు