తుది ఫలితాలపైనే కార్పొరేట్ల దృష్టి 

21 May, 2019 00:01 IST|Sakshi

ఎగ్జిట్‌ పోల్స్‌పై ఆచితూచి స్పందన 

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సర్కారుకు మరో దఫా అధికారం ఖాయమంటూ వచ్చిన ఎగ్జిట్‌ పోల్స్‌పై కార్పొరేట్‌ వర్గాలు ఆచితూచి స్పందించాయి. మే 23న తుది ఫలితాలొచ్చేదాకా వేచి చూడాలని అవి భావిస్తున్నాయి. కీలకమైన ఫిక్కీ, సీఐఐ, అసోచాం మొదలైన పరిశ్రమ సమాఖ్యలు ఎగ్జిట్‌ పోల్స్‌పై స్పందించేందుకు నిరాకరించాయి. అయితే, ఆనంద్‌ మహీంద్రా వంటి కొందరు కార్పొరేట్‌ దిగ్గజాలు తమదైన శైలిలో ఎగ్జిట్‌ పోల్స్, ఫలితాలపై వ్యాఖ్యలు చేశారు. ఈ వారంలో ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిణామాలేమిటంటూ మహీంద్రా గ్రూప్‌ చీఫ్‌ ఎకానమిస్టు సచ్చిదానంద్‌ శుక్లా చేసిన ట్వీట్‌పై గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా స్పందించారు.  ‘ఈ వారంలో అందరి దృష్టి ఆ ‘ఒక్క’ అంశంపైనే ఉంటుంది’ అంటూ పరోక్షంగా మే 23న ఫలితాలే కీలకంగా ఉండబోతున్నాయని హింట్‌ ఇచ్చారు.  

కొత్త ప్రధాని పేరు N అక్షరంతో ప్రారంభం.
ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ హర్‌‡్ష గోయెంకా కూడా ఎగ్జిట్‌ పోల్స్‌పై చమత్కార ధోరణిలో స్పందించారు. ‘పోల్స్‌ను బట్టి చూస్తే రాబోయే ప్రధాని పేరు ఆంగ్ల అక్షరం ఎన్‌ తో ప్రారంభమవుతుంది అన్నది మాత్రం ఖాయంగా తెలుస్తోంది‘ అంటూ మైక్రో బ్లాగింగ్‌ సైటు ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు. ఇక, ‘దేశ ప్రజలంతా ఓటరు అభిప్రాయాన్ని గౌరవించాల్సిందే. ప్రధాని నరేంద్ర మోదీకి మరో దఫా అధికారం ఇవ్వాలని ఓటర్లు భావించిన పక్షంలో అదే జరుగుతుంది’ అని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ తల్వార్‌ పేర్కొన్నారు. సరైన సందర్భం అనుకున్న ప్రతిసారీ భారతీయ ఓటరు.. ప్రభుత్వాలను మార్చేయడమో లేదా అదే ప్రభుత్వానికి మరోసారి అవకాశమివ్వడమో చేస్తూ వస్తున్నారని తెలిపారు. ఒకవేళ ఓటర్ల అభీష్టం మేరకు రెండో దఫా కూడా మోదీయే ప్రధానైతే.. దేశ ఎకానమీకీ మంచిదే కావొచ్చేమోనని తల్వార్‌ పేర్కొన్నారు. ‘ఇప్పటిదాకా అమలైన సంస్కరణలు, ప్రవేశపెట్టాల్సిన సంస్కరణలు చాలానే ఉన్నాయని పరిశ్రమ ప్రతినిధిగా నేను భావిస్తున్నాను. ఇది ఒక నిర్ణయాత్మక ప్రభుత్వం. మన దేశం వచ్చే ఐదేళ్లలో 7 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలంటే సంస్కరణలు కొనసాగాలి‘ అని చెప్పారు.  

మోదీ వస్తే మార్కెట్లకు మరింత జోష్‌ .. 
ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం ఒకవేళ ఎన్‌డీఏ ప్రభుత్వం గానీ పూర్తి మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తే.. పాలసీపరమైన సంస్కరణలు కొనసాగుతాయన్న ఆశలతో మార్కెట్లకు ఊపొస్తుందని బ్రోకరేజి సంస్థ ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. మిగతా వాటితో పోలిస్తే ఎన్‌డీయే ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉంటుందని తెలిపింది. ప్రజాకర్షక పథకాల జోలికి ఎక్కువగా పోకపోవడం వల్ల ద్రవ్యోల్బణ పరిస్థితులు కూడా మెరుగ్గానే ఉండవచ్చని అభిప్రాయపడింది. మరోవైపు, మే 23న ఎన్నికల ఫలితాలు ఊహించిన విధంగానే ఉన్న పక్షంలో మార్కెట్లు కొంత ర్యాలీ చేసే అవకాశం ఉందని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ ఒక నివేదికలో పేర్కొంది. 

మరిన్ని వార్తలు