బ్యాంకుల్లో రోబో హల్‌చల్‌

28 Feb, 2019 00:02 IST|Sakshi

కస్టమర్ల సేవలకు చాట్‌బాట్స్, వాయిస్‌బాట్స్‌

ఆటోమేషన్‌ విధానానికి ప్రాధాన్యం

మానవవనరుల వినియోగం తగ్గింపు

ప్రైవేటు బ్యాంకుల ముందంజ

న్యూఢిల్లీ: బ్యాంకులు టెక్నాలజీ ఆధారిత వేగవంతమైన సేవల వైపు అడుగులు వేస్తున్నాయి. సిబ్బంది అవసరాన్ని తగ్గించి టెక్నాలజీ సాయంతో ఆటోమేషన్‌ విధానంలో కస్టమర్ల విచారణలకు వివరాలు అందించడం, చాట్‌ ద్వారా, వాయిస్‌ ద్వారా సత్వర సేవలను అందించేందుకు విధానాలను అమలు చేస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, కోటక్‌ మహీంద్రా బ్యాంకు, యస్‌ బ్యాంకులు కస్టమర్ల సేవలకు చాట్‌బాట్స్, వాయిస్‌ బాట్స్‌ను ఉపయోగించుకుంటున్నాయి. 15 నెలల క్రితం నుంచి ఈ దిశగా అడుగులు వేయడం ఆరంభించాయి. ప్రాంతీయ భాషల్లో ప్రాసెసింగ్‌కు, కృత్రిమ మేథలో ఆధునికతల నేపథ్యంలో తాము భవిష్యత్తు ఆటోమేటెడ్‌ అంచున ఉన్నట్టు అవి పేర్కొంటున్నాయి. ‘‘ఏడాదిన్నర క్రితమే బాట్స్‌ (రోబో మాదిరిగా ఇంటర్నెట్‌ వేదికగా పనిచేసే ఓ ఆర్టిఫీషియల్‌ టూల్‌) వినియోగాన్ని ఆరంభించాం. ఇప్పటి వరకు 80 లక్షల విచారణలను పూర్తి చేశాం. సేవల విషయంలో 90 శాతం కచ్చితత్వాన్ని సాధించాం’’ అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిజిటల్‌ హెడ్‌ నితిత్‌చుగ్‌ తెలిపారు. కేవలం బ్యాంకింగ్‌ సేవల సహాయకారిగానే ఉండకుండా, తమ చాట్‌బాట్‌ అప్లికేషన్‌ ‘ఎవ’ ద్వారా బిల్లుల చెల్లింపులు, సినిమా టికెట్ల బుకింగ్, ఇతర సేవలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఎవ చాట్‌బాట్‌ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నెట్‌బ్యాంకింగ్‌ పోర్టల్‌లో కనిపిస్తుంది. ఈ టూల్‌ సాయంతో కస్టమర్లు తమ సందేహాలు, సేవలకు సంబంధించిన వివరాలు పొందొచ్చు. భిన్న రూపాల్లో వచ్చే ప్రశ్నలను ఏ విధంగా పరిష్కరించాలన్న దానిపై ఈ టూల్స్‌కు బ్యాంకర్లు ఎప్పటికప్పుడు తెలియజేయడం ద్వారానే ఎక్కువ కచ్చితత్వానికి అవకాశం ఉంటుంది.

కోటక్‌ బ్యాంకు సైతం 
కోటక్‌ మహింద్రా బ్యాంకు సైతం తన కార్యకలాపాల్లో బాట్‌ సేవలను ప్రోత్సహిస్తోంది. బాట్‌ద్వారా ప్రతీ కస్టమర్‌ ప్రతిస్పందించడాన్ని మూడు నాలుగు స్టెప్‌లకే పరిమితం చేస్తున్నామని, ఇది కస్టమర్‌ సేవల నిడివిని 45–50 సెకండ్లకే పరిమితం చేసేందుకు సాయపడుతోందని కోటక్‌ మహీంద్రా బ్యాంకు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పునీత్‌ కపూర్‌ తెలిపారు. 2018 ఫిబ్రవరిలో ప్రారంభించగా, 16 లక్షల ప్రశ్నలకు చాట్‌బాట్‌ సమాధానాలు ఇచ్చినట్టు, 91 శాతం అక్యురసీ ఉందని కపూర్‌ చెప్పారు. ఐవీఆర్‌ ఆధారిత సేవల పరిష్కారం సాధారణ ప్రక్రియలో 3 శాతంగా ఉంటే, బాట్‌ సాయంతో తొలి దశలోనే 9 శాతానికి చేరుకున్నట్టు తెలిపారు. రెండో దశలో ఇది ఇప్పటికే 14 శాతానికి చేరుకుందన్నారు. రెండో దశలో ఫిర్యాదుల నమోదు, పరిష్కారానికి అనుకూలంగా ఈ అప్లికేషన్లను అభివృద్ధి చేస్తున్నట్టు కపూర్‌ తెలిపారు. యస్‌ బ్యాంకు అయితే, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లను యస్‌ రోబో టూల్‌ ద్వారా బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

ఆధునిక ధోరణులే...
బ్యాంకుల ఆధునిక పోకడల వెనుక కారణాలను టెక్‌ స్టార్టప్‌ యాక్టివ్‌ ఏఐ వ్యవస్థాపకుడు రవిశంకర్‌ వివరించారు. ‘‘మిలీనియల్స్‌ (21 శతాబ్దంలో యుక్త వయసులోకి వచ్చిన వారు) సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇతర వేదికల్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. కనుక బ్యాంకులు సైతం ఆయా ప్లాట్‌ఫామ్‌లపై అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. మెస్సేజింగ్‌ యాప్స్‌కు 30 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. కానీ, బ్యాంకులకు 2.5 కోట్ల యూజర్లే ఉన్నారు. బ్యాంకులు సంభాషణల ఆధారిత ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్లాట్‌ఫామ్‌లతో కస్టమర్లకు చేరువ కావాలి. బ్యాంకు అప్లికేషన్‌లోనే గూగుల్‌ సెర్చ్‌ మాదిరిగా సెర్చ్‌ బార్‌ ఉండాలి. అక్కడ కస్టమర్‌కు అందుబాటులో ఉన్న అన్ని సేవల వివరాలు ఉంచాలి. అలాగే, బ్యాంకింగ్‌తో సంభాషణలన్నీ టెక్స్ట్, ఎమోజిలు, గెస్చర్స్‌తోనే జరగాలి. ఆర్థిక సేవలకు భవిష్యత్తు అంతా ఆర్టిఫీషియల్‌ తరమే’’ అని రవిశంకర్‌ పేర్కొన్నారు. ఈ తరహా సేవల వల్ల బ్యాంకులకు ఖర్చులు బాగా తగ్గుతాయి. అలాగే కస్టమర్లకు సేవలు వేగంగా అందుతాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు