డీజిల్ ధరలపై త్వరలో నియంత్రణ ఎత్తివేత?

17 Jun, 2014 00:45 IST|Sakshi
డీజిల్ ధరలపై త్వరలో నియంత్రణ ఎత్తివేత?

న్యూఢిల్లీ: డీజిల్ అమ్మకంపై నష్టం రికార్డు స్థాయిలో తగ్గిపోయింది. డీజిల్ ఉత్పత్తి వ్యయం, విక్రయ ధరల మధ్య వ్యత్యాసం ఈ నెల తొలి పక్షంలో లీటరుకు రూ.2.80 ఉండగా, ఇప్పుడది రూ.1.62కు తగ్గిపోయింది. రూపాయి మారకం విలువ బలపడుతూ, లీటరు రేటును నెలకు 50 పైసల చొప్పున పెంచుతుంటే వచ్చే సెప్టెంబరుకల్లా డీజిల్ ధరలపై ఆంక్షలను ప్రభుత్వం తొలగించనుంది.
 
ధరలను ప్రతినెలా స్వల్పంగా పెంచడం ద్వారా సబ్సిడీలను ఎత్తివేయాలన్న మునుపటి యుపీఏ ప్రభుత్వ నిర్ణయాన్ని నరేంద్ర మోడీ సర్కారు కొనసాగిస్తోంది. గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 16 విడతల్లో లీటరు డీజిల్ ధరను రూ.10.12 పెంచారు. మే ద్వితీయార్థంతో పోలిస్తే ఈ నెల ప్రథమార్థంలో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు తగ్గాయని అధికారులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత నెలలో మోడీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టినపుడు లీటరుపై రూ.4.41 చొప్పున నష్టం వచ్చింది.

 పెట్రోలు ధరలపై కంట్రోలును 2010 నుంచి ఎత్తివేశారు. దీంతో ఉత్పత్తి వ్యయానికి తగ్గట్లుగా పెట్రోలు ధరలు ఉంటున్నాయి. డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ సిలిండర్లను సబ్సిడీపై విక్రయిస్తున్నందువల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలకు ప్రస్తుతం రోజుకు రూ.249 కోట్లు నష్టం వస్తోంది. గత పక్షంలో ఇది రూ.262 కోట్లుగా ఉంది.

మరిన్ని వార్తలు