మరింత పెరగనున్న ధరలు

17 Aug, 2017 00:16 IST|Sakshi
మరింత పెరగనున్న ధరలు

ఆగస్టులో 3 శాతానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం
నివేదికలో మోర్గాన్‌ స్టాన్లీ అంచనాలు


న్యూఢిల్లీ: రానున్న నెలల్లో టోకు, రిటైల్‌ ద్రవ్యోల్బణాలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ ఒక నివేదికలో పేర్కొంది. దీంతో.. రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య పరపతి విధానాన్ని మరింత సడలించే అవకాశాలు తక్కువేనని వివరించింది. జూలైలో పెరిగిన టోకు, రిటైల్‌ ద్రవ్యోల్బణాలు.. ఇకపై అదే ధోరణిలో కొనసాగుతాయని మోర్గాన్‌ స్టాన్లీ తెలిపింది. జూన్‌లో 0.90 శాతంగా ఉన్న టోకు ద్రవ్యోల్బణ పెరుగుదల.. ప్రధానంగా కూరగాయలు తదితర ఆహారోత్పత్తుల రేట్లు ఎగియడంతో జూలైలో 1.88 శాతంగా నమోదైంది.

పంచదార, కన్ఫెక్షనరీ ఉత్పత్తులు, పొగాకు తదితర ఉత్పత్తుల ధరలు పెరగడం వల్ల రిటైల్‌ ద్రవ్యోల్బణం 2.36 శాతానికి ఎగిసింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 3.0 శాతానికి, టోకు ద్రవ్యోల్బణం 2.1 శాతానికి పెరగొచ్చని పేర్కొంది. అంతర్జాతీయంగా కమోడిటీల రేట్లు, ఇటు దేశీయంగా ఆహారపదార్ధాల రేట్లు పెరుగుతుండటం ఇందుకు కారణమని అధ్యయన నివేదికలో వివరించింది. ద్రవ్యోల్బణం క్రమంగా లకి‡్ష్యత 4 శాతం స్థాయి దిశగా వెడుతున్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ .. కీలక పాలసీ రేట్లను మరింతగా తగ్గించే అవకాశాలు ఉండకపోవచ్చని పేర్కొంది. 

మరిన్ని వార్తలు