అదుపులోనే రిటైల్‌ ధరల స్పీడ్‌

14 Aug, 2019 10:59 IST|Sakshi

జూలైలో 3.15 శాతం

ఆర్‌బీఐ నిర్దేశిత స్థాయిలోనే కట్టడి

న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం జూలైలో 3.15 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జూలైతో పోల్చితే 2019 జూలైలో వినియోగ ధరల సూచీలో పేర్కొన్న వస్తువులు, ఉత్పత్తుల బాస్కెట్‌ ధర మొత్తం కేవలం 3.15 శాతమే పెరిగిందన్నమాట. ఇది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశిత స్థాయిలోనే రిటైల్‌ ద్రవ్యోల్బణం కొనసాగుతుండడం గమనార్హం. 2 శాతానికి ప్లస్‌ 2 శాతం లేదా మైనస్‌ 2 శాతంగా ఉండేలా చూడాలని ఆర్‌బీఐకి కేంద్రం సూచిస్తోంది.  అంటే 4 శాతం దాటితే ధరల తీవ్రతను మైనస్‌లోకి వెళితే వ్యవస్థలోని మందగమన పరిస్థితులకు ఇది సంకేతంగా ఉంటుంది. తాజా సమీక్షా నెల జూలైలో ఆహార ధరల సూచీ పెరిగినప్పటికీ ఇంధనం, లైట్‌ ధరలు అదుపులో ఉన్నాయి. 2018 జూలైలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 4.17 శాతం. 2019 జూన్‌లో 3.18 శాతంగా ఉంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమ లు శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం– ప్రధాన సూచీలను పరిశీలిస్తే...

కేవలం ఆహార విభాగాన్ని చూస్తే, వినియోగ ఆహార ధరల సూచీ (సీఎఫ్‌పీఐ)  2.36 శాతంగా నమోదయ్యింది. జూన్‌లో ఇది 2.25 శాతం. అయితే జూన్‌లో 4.66 శాతంగా ఉన్న కూరగాయల ధరలు జూలైలో 2.82 శాతంగా నమోదయ్యాయి. పప్పులు సంబంధిత ఉత్పత్తుల ధరలు 5.68 శాతం నుంచి 6.82 శాతానికి పెరిగాయి. పండ్ల ధరలు పెరక్కపోగా మైనస్‌లోనే ఉన్నాయి. –0.86 శాతంగా నమోదయ్యాయి. జూన్‌లో ఈ తగ్గుదల (మైనస్‌) 4.18 శాతం. ప్రొటీన్‌ ఆధారిత మాంసం, చేపల ధరల పెరుగుదల జూన్‌ (9.01 శాతం తరహాలోనే కేవలం 9.05 శాతంగా ఉంది. అయితే గుడ్ల ధరలు 1.62 శాతం నుంచి 0.57 శాతానికి తగ్గాయి. 
ఇంధనం, లైట్‌ కేటగిరీలో ధర జూలై క్షీణించి – 0.36 శాతంగా నమోదయ్యింది. జూన్‌లో ఈ పెరుగుదల రేటు 2.32 శాతంగా ఉంది.  
ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానానికి రిటైల్‌ ద్రవ్యోల్బణమే ప్రమాణంగా ఉండే విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు