మార్కెట్‌ రుణ లక్ష్యం తగ్గింపు

29 Sep, 2018 00:57 IST|Sakshi

కేంద్రం ప్రకటన

చిన్న పొదుపుల పెరుగుదల అంచనాలే కారణం

షేర్‌ బైబ్యాక్‌పై పునరాలోచన

న్యూఢిల్లీ: మార్కెట్‌ ద్వారా రుణ సమీకరణ స్థూల అంచనాల లక్ష్యాన్ని కేంద్రం రూ.70,000 కోట్లు తగ్గించుకుంది. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ రుణాల ద్వారా రూ.6.05 లక్షల కోట్లు సమీకరించుకోవాలని బడ్జెట్‌ ప్రతిపాదించింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం– ఇందులో రూ.70,000 కోట్లు తగ్గించుకుంది.

‘‘మంచి ప్రజాదరణ ఉన్న చిన్న పొదుపు మొత్తాల పథకాల ద్వారా అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో అంచనాలకు మించి మరిన్ని నిధులు వస్తాయని భావిస్తున్నాం. వడ్డీరేట్ల పెరుగుదల దీనికి కారణం. అందువల్ల మార్కెట్‌ రుణ లక్ష్యాలను తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తోంది’’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆదాయాలు–వ్యయాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించుకోడానికి మార్కెట్‌ ద్వారా సమీకరించిన రుణ మొత్తాలను వినియోగించుకోవడం జరుగుతుంది.

ఇప్పటికి రూ.2.88 లక్షల కోట్ల సమీకరణ...
2019 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) బడ్జెట్‌ లక్ష్యాలకు అనుగుణంగా 3.3% వద్ద కట్టడి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థికశాఖ వర్గాలు తెలిపారు.

2018–19 ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య రుణ ప్రణాళిక కింద రూ.2.88 లక్షల కోట్ల సమీకరణ జరగ్గా, అక్టోబర్‌–మార్చి మధ్య రూ.2.47 లక్షల కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్‌సీ గార్గ్‌ తెలిపారు.  ఆయా అంశాల నేపథ్యంలో కంపెనీ షేర్‌ బైబ్యాక్‌  ప్రణాళికపై పునఃపరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణ సూచీ ఆధారిత బాండ్లను ఆవిష్కరించనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.

మరిన్ని వార్తలు