రిటైరైన వాళ్లు ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా? 

2 Mar, 2020 07:57 IST|Sakshi

ప్రశ్న: నాకు ఇటీవలనే కొంత మొత్తంలో బోనస్‌ వచ్చింది. ప్రస్తుతం ఈ డబ్బులను ఖర్చు చేయకుండా మూడేళ్ల తర్వాత వాడుకుందామనుకుంటున్నాను. మూడేళ్ల కాలానికైతే డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయమని స్నేహితులు సలహా ఇస్తున్నారు. ఏ తరహా డెట్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మంచిది ?  
–శ్రావణి, విజయవాడ  

డెట్‌ ఫండ్స్‌ గత ఏడాది మిశ్రమ ఫలితాలనిచ్చాయి. డెట్‌ ఫండ్స్‌కు కూడా రిస్క్‌ ఉంటుందని గుర్తించాలి. అయితే గతంలో ఎప్పుడు ఆ రిస్క్‌ డెట్‌ ఫండ్స్‌పై ప్రభావం చూపలేదు. కానీ 2019లో మాత్రం డెట్‌ ఫండ్స్‌ ఆశించిన రాబడులను ఇవ్వలేకపోయాయి. అందుకని డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ఇప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. షార్ట్‌–డ్యురేషన్‌ డెట్‌ ఫండ్స్‌లో మినహా మరే ఇతర డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయకపోవడమే మంచిది. డెట్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ప్రయోగాలు చేయకండి. 1 లేదా 2 శాతం అదనపు రాబడుల కోసం ఇతర ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే మీ పెట్టుబడి విషయంలో అసలుకే ఎసరు రావచ్చు. ఏతావాతా మూడేళ్ల కాలానికి ఇన్వెస్ట్‌ చేయడానికి షార్ట్‌–డ్యురేషన్‌ డెట్‌ ఫండ్స్‌నే పరిగణనలోకి తీసుకోండి.  

ప్రశ్న: నేను ప్రతినెలా కొంత మొత్తం మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం నాకు ఇదే మొదటిసారి. స్వల్ప కాలిక ఆరి్థక లక్ష్యాలు, దీర్ఘకాలిక ఆరి్థక లక్ష్యాలు సాధించడం కోసం ఏ తరహా ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయాలో సూచించండి.  
–దీపక్, విశాఖపట్టణం  

మ్యూచువల్‌ ఫండ్స్‌లో కొత్తగా ఇన్వెస్ట్‌ చేసే మీ లాంటి వాళ్లు దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం హైబ్రిడ్‌ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. కనీసం మూడేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయదల్చుకుంటేనే ఈ ఫండ్స్‌లో మదుపు చేయాలి. ఐదు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తే, మీరు మంచి రాబడులు పొందగలుగుతారు. ఈ ఫండ్స్‌ తమ మొత్తం  నిధులు 65 శాతం ఈక్విటీలోనూ. 35 శాతం డెట్‌లోనూ ఇన్వెస్ట్‌ చేస్తాయి. స్టాక్‌ మార్కెట్‌ పతనసమయంలో మీ పెట్టుబడి దెబ్బతినకుండా ఈ డెట్‌ విభాగం రక్షణనిస్తుంది. మార్కెట్‌ బాగా పెరుగుతున్నప్పుడు ఈక్విటీ విభాగం మంచి రాబడులనిస్తుంది. మీరు మ్యూచువల్‌ ఫండ్స్‌కు కొత్త కాబట్టి, ముందే ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయకండి.

మార్కెట్‌ గమనాన్ని బట్టి ఈక్విటీ ఫండ్స్‌ తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయి. ఆరంభంలోనే ఇలాంటి ఆటుపోట్లు ఎదుర్కోకుండా ఉండాలంటే, ఈక్విటీ ఫండ్స్‌ కంటే హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకోవడమే మంచిది. ఎస్‌బీఐ ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్, మిరా అసెట్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్‌లను పరిశీలించవచ్చు. ఇక స్వల్ప కాలిక ఆరి్థక లక్ష్యాల కోసం షార్ట్‌–డ్యురేషన్‌ ఫండ్‌ను ఎంచుకోండి. మరే ఇతర ఫండ్స్‌ వద్దు. స్వల్ప కాలిక ఆరి్థక లక్ష్యాల కోసం ఈక్విటీ ఫండ్‌లో ఎప్పుడూ ఇన్వెస్ట్‌ చేయకండి. ఇక మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఎప్పుడూ పెద్ద మొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయవద్దు. నెలకు కొంత మొత్తం చొప్పున సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేయండి. ఇలా చేస్తే, మార్కెట్‌ పతన బాటలో ఉన్నప్పుడు మీకు యావరేజంగ్‌ ప్రయోజనాలు లభిస్తాయి. ఇక ప్రతి ఏడాది మీ సిప్‌మొత్తాలను కనీసం 10 శాతం మేర పెంచే ప్రయత్నాలు చేయండి. ఏడాదికి ఒక్కసారైనా, మీ ఫండ్స్‌ పనితీరును సమీక్షించండి.  

ప్రశ్న: నేను ఇటీవలనే రిటైరయ్యాను. రిటైరైన వ్యక్తులు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సురక్షితమేనా ?  
–బాబూమియా, హైదరాబాద్‌  

మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం సురక్షితమే కాకుండా అత్యంత ముఖ్యమైనది కూడా. మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తి కాదు. ఈక్విటీల్లోనూ, స్థిరాదాయ సాధనాల్లోనూ ఒక క్రమపద్ధతిలో ఇన్వెస్ట్‌ చేయడానికి మ్యూచువల్‌ ఫండ్స్‌ ఒక సాధనం. మీరు ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేశారనుకోండి. ఈ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోలో వివిధ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు ఉంటాయి. ఫలితంగా మీరు డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు పొందవచ్చు. అంతే కాకుండా ఈ ఫండ్‌ను ఎంతో అనుభవం, నైపుణ్యం ఉన్న ఫండ్‌ మేనేజర్‌ నిర్వహిస్తాడు కాబట్టి, మంచి రాబడులే వచ్చే అవకాశాలుంటాయి.

ఎక్కడెక్కడి నుంచో, ఎంతెంతో సమాచారం సేకరించి, శోధించి ఏ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలో, ఏ కంపెనీని విస్మరించాలో... ఇలాంటి ఎలాంటి తలనొప్పులు మీకు లేకుండా ఫండ్‌ మేనేజర్లు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇక స్థిరాదాయం వచ్చే ఫిక్స్‌డ్‌–ఇన్‌కమ్‌ ఫండ్స్‌ను తీసుకుంటే, వీటికి పన్ను ప్రయోజనాలు, లిక్విడిటీ అధికంగా ఉంటాయి. సాధారణంగా వ్యక్తులు ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడులు పెట్టలేరు. కానీ ఓవర్‌నైట్, లిక్విడ్‌ ఫండ్స్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఈ ప్రయోజనాలు పొందవచ్చు. అందుకని రిటైరైన వాళ్లైనా, ఇప్పుడు సంపాదనలో ఉన్న వాళైనా, ఎవరైనా సరే, మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మిస్‌ చేసుకోకూడదు. ఇది అత్యంత ముఖ్యమైన, సమంజసమైన ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనం. -- (ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌)

మరిన్ని వార్తలు