వెబ్‌ చెకిన్‌ ఛార్జీలపై సమీక్ష

27 Nov, 2018 00:28 IST|Sakshi

పౌర విమానయాన శాఖ వెల్లడి 

ఇండిగో వివాదంతో నిర్ణయం 

న్యూఢిల్లీ: విమాన ప్రయాణాలకు సంబంధించి వెబ్‌ చెకిన్‌ విధానంలో ఏ సీటు ఎంపిక చేసుకున్నా చార్జీలు వర్తిస్తాయంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్‌ చేసిన ప్రకటన వివాదం రేపడంతో కేంద్ర పౌరవిమానయాన శాఖ (ఎంవోసీఏ) రంగంలోకి దిగింది. ఇలాంటి విధానాలు ప్రస్తుత నిబంధనలకు లోబడే ఉన్నాయా లేదా ఉల్లంఘిస్తున్నాయా అన్న అంశాన్ని సమీక్షించనున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొంది. కొన్ని ఎయిర్‌లైన్స్‌ ప్రస్తుతం అన్ని సీట్లకు వెబ్‌ చెకిన్‌ చార్జీలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ చార్జీలు అన్‌బండిల్డ్‌ ధర విధానం పరిధిలోకి లోబడే ఉన్నాయా లేదా అన్నది సమీక్షించనున్నామని వివరించింది. అన్‌బండిల్డ్‌
ధర విధానం కింద.. సీట్ల కేటాయింపు సహా వివిధ సర్వీసులకు ఎయిర్‌లైన్స్‌ వేర్వేరుగా చార్జీలు వసూలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.  

వివాదమిదీ.. 
విమాన ప్రయాణానికి సంబంధించి ఆన్‌లైన్‌లోనే సీటును ఎంపిక చేసుకుని, ప్రయాణ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడాన్ని వెబ్‌ చెకిన్‌గా వ్యవహరిస్తారు. సాధారణంగా సీటు ఎంపిక ప్రాధాన్యతలను బట్టి ఎయిర్‌లైన్స్‌ నిర్దిష్ట చార్జీలు వసూలు చేస్తుంటాయి. ఈ సీట్లలో కొన్ని ఉచితంగా కూడా ఉంటాయి. అయితే, ఇండిగో ఆదివారం నాడు ఇకపై అన్ని సీట్లకు చార్జీలు వర్తింపచేస్తున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొనడం దుమారం రేపింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో సోమవారం ఇండిగో మరో ప్రకటన విడుదల చేసింది. తమ విధానాల్లో మార్పులేమీ చేయలేదని, వెబ్‌ చెకిన్‌కి చార్జీలేమీ విధించబోవడం లేదని పేర్కొంది. ముందస్తుగా సీట్లను ఎంపిక చేసుకునే వారికి మాత్రమే ఇవి వర్తిస్తాయని వివరించింది. మార్కెట్‌ డిమాండ్, ప్రయాణికుల అభీష్టాన్ని బట్టి చార్జీలు ఉంటాయని ఇండిగో తెలిపింది. ప్రిఫర్డ్‌ సీటింగ్‌ చార్జీ అత్యంత తక్కువగా రూ. 100 నుంచి ఉంటుందని పేర్కొంది. ఇవి కాకుండా ఎప్పట్లాగే కొన్ని ఉచిత సీట్లు కూడా ఉంటాయని, సీటింగ్‌ పట్టింపు లేని వారు వీటిని ఎంపిక చేసుకోవచ్చని లేదా ఎయిర్‌పోర్ట్‌లోనైనా ఉచితంగా చెకిన్‌ ప్రక్రియ పూర్తి చేయొచ్చని వివరించింది. మరోవైపు ఇదే అంశంపై ట్విటర్‌లో ప్రయాణికుల ప్రశ్నలకు స్పందిస్తూ.. వెబ్‌ చెకిన్‌ల ద్వారా సీట్లను ముందస్తుగా కేటాయించేందుకు చార్జీలు వర్తిస్తాయంటూ  స్పైస్‌జెట్‌ వెల్లడించింది. 

మరిన్ని వార్తలు